మెయిన్స్‌లో సమాధానాలను ప్రశ్న స్వభావాన్ని బట్టి పాయింట్లుగా లేదా పేరాలుగా రాయాల్సి ఉంటుందే తప్ప, తప్పనిసరిగా ఇందులో ఏదో ఒక పద్ధతికి ఎక్కువ మార్కులు పడతాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే. అయితే అత్యధిక ప్రశ్నలు పేరాలుగా రాసే విధంగానే ఉంటాయి. కాబట్టి తక్కువ నిడివిగల పేరాలుగా సమాధానాన్ని రాసే విధంగా సాధన చేయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్ నూతన విధానంలో కేవలం 10 నుండి 12 నిమిషాల్లోనే సుదీర్ఘమైన ప్రశ్నకు సైతం సమాధానాన్ని రాయాల్సిన పరిస్థితి ఉన్నందున విషయాన్ని ముక్కుసూటిగా, పేపర్ దిద్దే ప్రొఫెసర్‌కు సులభంగా అర్థమయ్యే విధంగా, చెప్పదల్చుకున్న విషయాన్ని సరళమైన భాషలో రాయడం మంచిది. ప్రశ్నలో కారణాలు, ప్రభావం, నమూనాలు, పద్ధతులు వంటి పదాలు కనపడితే సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయడం మంచిది. ఇక ప్రశ్నలో వివరింపుము, విశ్లేషించుము, సమీక్షించుము, పరీక్షించుము, చర్చించుము వంటి పదాలు ఉంటే సమాధానాన్ని పేరాలుగా రాయడం ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశముంటుంది. అయితే దీనికి ఖచ్చితమైన నిబంధన అంటూ ఏమీ ఉండదు. కాకపోతే అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన, సమగ్రమైన సమాధానాన్ని ఏ విధంగా రాస్తే బాగుంటుందో అన్నది పరీక్ష హాల్లోనే అభ్యర్థి విచక్షణ ఆధారంగా నిర్ణయించుకోవాలి.
ఇక ఏస్సే పేపర్‌లో సైడ్ హెడ్డింగ్‌లకు సంబంధించి మీరు అడిగిన సందేహం అనేక మంది అభ్యర్థులకు కూడా ఉంది. అయితే జనరల్ ఎస్సే ప్రశ్నాపత్రంలో పేర్కొన్న సూచనలు, నోట్‌లో ఎక్కడా కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టకూడదని పేర్కొనలేదు. ఒకవేళ పెడితే తక్కువ మార్కులు వస్తాయని అనుకోవడం కూడా కరక్ట్ కాదు కాకపోతే జనరల్ ఎస్సే స్వభావం ఒక అంశానికి సంబంధించిన విభిన్న కోణాలను పశ్నలో అడిగిన తీరుకు తగ్గట్టుగా) ఒక ప్రవాహంలా వివరించాల్సి ఉంటుంది. ఒక నవలను చదువుతున్నప్పుడు కథ కళ్ల ముందు కదలాడినట్లు ఎస్సేలో సమాచారం ఒక క్రమపద్ధతిలో సామాన్య పాఠకునికి సైతం అర్థమయ్యే విధంగా రాయగలగాలి. సమాధానం మొత్తాన్ని ఎగ్జామినర్ చదివే విధంగా రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి సైడ్ హెడ్డింగ్‌ల అవసరం ఉండకపోవచ్చు. పెద్ద ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అకడమిక్ పరీక్షలో ఎక్కువగా సైడ్ హెడ్డింగ్‌ల ప్రస్తావన కనపడుతుంది తప్ప పోటీ పరీక్షలలో రాసే సమాధానాలకు సైడ్ హెడ్డింగ్‌లు పెట్టకపోవడమే మంచిది. కాకపోతే పేరాలు మరీ చిన్నవిగా, లేదా మరీ పెద్దవిగా కాకుండా మద్యస్థంగా ఉండేటట్లు చూసుకోవాలి. అదే విధంగా ప్రతిపేరాలో ఒక అంశం ఉండేటట్లు చూసుకోవాలి.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...