Pages

Mobile Ad

June 25, 2014

Parliament Setup in India (Telugu Medium)

పార్లమెంటు నిర్మాణం, విధులు, అధికారాలు, శాసన ప్రక్రియ వంటి అంశాలను గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న ప్రకరణ 79 నుంచి 123 వరకు రాజ్యాంగ రూపకర్తలు వివరించారు. ప్రకరణ 79 ప్రకారం రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభలను కలిపి పార్లమెంట్ అంటారు. అయితే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు. ప్రతి శాసనప్రక్రియ రాష్ట్రపతితో ముడిపడి ఉండటంతో ఆయనను పార్లమెంటులో అంతర్భాగంగా పరిగణిస్తారు. పార్లమెంటు సమావేశాల ఏర్పాటు, సభనుద్దేశించి ప్రసంగించడం, బిల్లులకు ఆమోదం తెలపడం, లోక్‌సభ రద్దు మొదలైన అంశాలన్నీ రాష్ట్రపతితో ముడిపడి ఉన్న శాసన పరమైన అంశాలు. పార్లమెంటులో లోక్‌సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ)లుంటాయి. 

లోక్‌సభ



లోక్‌సభను ఇంగ్లీష్‌లో హౌజ్ ఆఫ్ పీపుల్ పజల సభ) అంటారు. దీని నిర్మాణం, ఎన్నిక మొదలైన అంశాలన్నీ ప్రకరణ 81లో ఉన్నాయి. 
- లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య - 552
- ఇందులో రాష్ర్టాల నుంచి 530 మంది సభ్యులకు మించకుండా ఎన్నికవుతారు.
- కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది సభ్యులు
- మిగిలిని ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.


సభ్యుల ఎన్నికల - ప్రాతినిధ్యం



లోక్‌సభ సభ్యులు నియోజక వర్గాల ప్రాతిపదికన, సార్వజనీన వయోజన ఓటుహుక్కు (ఆర్టికల్ 326) ప్రకారం నేరుగా ఓటర్ల చేత ఎన్నికవుతారు. ఈ పద్ధతినే ఇంగ్లీష్‌లో First past the post అంటారు. winner gets all అని దీని అర్థం. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు రహస్య ఓటింగు పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.


నామినేటెడ్ సభ్యులు



ఆర్టికల్ 331 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేనట్లయితే ఇలా నామినేట్ చేస్తారు. ఈ ప్రక్రియ 1960 వరకే అమలులో ఉండేది. కానీ 2009లో 109వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 2020 వరకు పొడిగించారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు



ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రకరణ 330 ప్రకారం లోక్‌సభలో కొన్ని స్థానాలను కేటాయించారు. దీనిని కేవలం 10 సంవత్సరాల కాలపరిమితికే వర్తించేలా చేశారు. అయితే ఈ ప్రక్రియను పొడిగిస్తూ ఇప్పటిరకు ఆరు పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించారు. అవి 1996లో 8వ రాజ్యాంగ సవరణ, 1969లో 23వ, 1980 45వ సారి, 1989లో 62వ సారి, 1999లో 79వ, 2009లో 95వసారి రాజ్యాంగాన్ని సవరించారు. 2001వరకు ఎస్సీలకు 79 స్థానాలు, ఎస్టీలకు 41 స్థానాలు ఉండగా 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని 84 స్థానాలకు, 47కు పెంచారు. 


అర్హతలు



లోక్‌సభ సభ్యునిగా పోటీచేయడానికి 
- భారతీయ పౌరసత్వం ఉండాలి
- 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు.
- ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు
- దివాళా తీసి ఉండకూడదు
- నేరారోపణ ఋజువై ఉండరాదు
- శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి
- దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి


షరతులు



- పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్ పత్రంతో పాటు రూ. 25వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు మాత్రం కేవలం రూ. 12,500 చెల్లించాలి.
- అభ్యర్థి తన ఆస్తులను, అప్పులను, నేరచరిత్రను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో తెలపాలి.


పదవీకాలం



83వ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ సాధారణంగా 5 సంవత్సరాల కాల వ్యవధి కలిగి ఉంటుంది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు పదవీకాలాన్ని ఒక ఏడాది వరకు పొడిగించవచ్చు. అది రద్దయిన తరువాత ఆరునెలల కంటే ఎక్కువ పొడిగించడానికి వీల్లేదు. అలాగే రాజకీయ అనిశ్చితి ఏర్పడినపుడు ఆర్టికల్ 85 ప్రకారం 5 సంవత్సరాల కంటే ముందే లోక్‌సభను రద్దు చేయవచ్చు.



రాజ్యసభ
ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభలో గరిష్ఠంగా 250 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 238 మంది సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్ర విధాన సభకు ఎన్నికైన సభ్యులు పరోక్ష్యంగా ఎన్నుకుంటారు. మిగిలిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి శాస్త్ర సాంకేతిక, కళలు, సాహిత్యం, సంఘసేవ వంటి వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని నామినేట్ చేస్తారు. రాజ్యసభతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. ఇందులో 229 మంది రాష్ర్టాల నుంచి, నలుగురు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుల సంఖ్యను ఆయా రాష్ర్టాల జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. రాష్ర్టాలకు ప్రాతినిధ్యం వహించే వీరిని నియోజక వర్గాల ప్రాతిపదిన ఎన్నికలు జరగవు. అందుకే రాజ్యసభను రాష్ర్టాల మండలి (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) అంటారు.



అర్హతలు



- భారత పౌరుడై ఉండాలి
- 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు
- పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి. ఈ షరతులు లోక్‌సభ సభ్యులతో సమానంగా ఉంటాయి.


కాలవ్యవధి



రాజ్యసభ శాశ్వత సభ. ఇది లోక్‌సభ వలె రద్దుకాదు. కానీ సభ్యులు మాత్రం 6 సంవత్సరాల కాలవ్యవధికి ఎన్నికవుతారు. అయితే ప్రతి రెండుసంవత్సరాలకు 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఇలా నిరంతరంగా సభ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే దీనిని శాశ్వతసభ అని, నిరంతర సభ అని అంటారు.


పార్లమెంటు సమావేశాలు



ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంటు ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాలి. అయితే ఈ రెండు సమావేశాల మధ్యకాలం ఆరునెలల కంటే ఎక్కువగా ఉండకూడదు. అవసరమైనపుడు ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించవచ్చు. గరిష్ఠ సమావేశాలపైన పరిమితి లేదు. అయితే ప్రస్తుతం పార్లమెంటు ఆనవాయితీగా సంవత్సరానికి మూడుసార్లు సమావేశమవుతుంది. అవి



- బడ్జెట్ సమావేశాలు - ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 
- వర్షాకాల సమావేశాలు - జూలై నుంచి ఆగస్టు వరకు
- శీతాకాల సమావేశాలు - నవంబర్ నుంచి డిసెంబర్ వరకు
ప్రతి సమావేశం ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే అంశంపై నిర్ధిష్టమైన సంఖ్యలేదు. మూడు సమావేశాలు కలిపి సుమారు 80 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. 



సభ్యుల అనర్హతలు
పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి ఆర్టికల్ 102లో పేర్కొన్నారు. వాటి ప్రకారం సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది.
- లాభదాయక పదవుల్లో కొనసాగినపుడు
-మానసికంగా స్థిమితం లేదని కోర్టు ధ్రువీకరించినపుడు
- దివాళా తీసినపుడు
- భారత పౌరసత్వాన్ని కోల్పోయినపుడు
- ఎన్నికల్లో అక్రమాలు ఋజువైనపుడు
- ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనపుడు
- పదవిని దుర్వినియోపరచినపుడు
- వరకట్నం, సతీ, అస్పశ్యతా చట్టాల కింద శిక్షింపబడినపుడు
- పార్టీ ఫిరాయించినా, పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది.
చివరి కారణం మినహా కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం.


Important Points:

- 1919లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా మొదటిసారిగా కేంద్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. 
- లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. అయితే ప్రస్తుతం వీరి సంఖ్య 545 మాత్రమే.
- మొదటి లోక్‌సభ సభ్యుల సంఖ్య - 525. అయితే 1973లో చేసిన 31వ రాజ్యాంగ సవరణ ద్వారా వీరి సంఖ్యను 545కు పెంచారు.
- మౌలిక రాజ్యాంగంలో ఓటింగు వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు.
- మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు.
- లోక్‌సభ స్థానాల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా మేర కు ఉంటుంది. ఒక్కో సభ్యుడు సరాసరి 5 నుంచి 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ పదవీకాలాన్ని ఆరు సంవత్సరాలకు పొడిగించారు. కానీ 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని మళ్లీ ఐదు సంవత్సరాలకే కుదించారు.

No comments:

Post a Comment

Google Sign-in enabled to reduce spam...

Mobile Ad2