ఎపిపిఎస్‌సి నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. అయితే జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు చదవాలో తెలియడం లేదు. సాధారణంగా దీనికి సంబంధించి ఎపిపిఎస్‌సి ఎన్ని నెలలు కవర్ చేస్తుంది? కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ విడుదలయ్యాక చదవడం మంచిదా? సలహా ఇవ్వండి? - కె.హరిత, మిర్యాలగూడ.
జ : ఎపిపిఎస్‌సి నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలలో జనరల్‌స్టడీస్ తప్పనిసరి పేపర్‌గా ఉండటం, ఇందులో కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకంగా ఉన్నందున అభ్యర్థులందరూ ఈ అంశానికి అధిక ప్రాధాన్యత నివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న అనేక మంది అభ్యర్థులకు కూడా ప్రధాన సందేహంగా ఉన్నది.జనరల్ స్డడీస్‌లో కరెంట్ అఫైర్స్ అంటే ఎంత కాలం నుండి జరిగిన సంఘటనలను చదవాలన్న నిర్ధిష్ట కాలపరిమితి లేదు కాకపోతే పరీక్ష జరిగే నాటికి ముందు ఒక సంవత్సర కాలంలో జరిగిన ముఖ్యమైన అంశాలను చదవడం మంచిది. కరెంట్ అఫైర్స్‌ను జనరల్ స్టడీస్‌లోని ఎకానమీ, పాలిటీ, సైన్స్ & టెక్నాలజీ విభాగాలలో నూతన అంశాలుగా భావించి చదవగలిగితే ఏక కాలంలో అనేక అంశాలు కవర్ అవ్వడమే కాకుండా ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. కరెంట్ అఫైర్స్‌లో జనరల్‌గా ఉండే అవార్డులు, క్రీడలు, సమావేశాలు, ఆవిష్కరణలు, కమిటీలు, కమిషన్లు, పథకాలు వంటి అంశాలను తప్పనిసరిగా ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. పరీక్ష స్వభావాన్ని బట్టి సంఘటనలలో ముఖ్యమైన వాటిని గుర్తించగలగాలి. కరెంట్ అఫైర్స్ విషయంలో అత్యధిక మంది అభ్యర్థులు పరీక్ష సమయం దగ్గర పడ్డాక మార్కెట్‌లో లభించే ఏదో ఒక బుక్‌ను చదవడానికే ఎక్కువ ఇష్టపడతారు. అయితే దీనివల్ల ఎక్కువ మార్కులు రావన్న సత్యాన్ని కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. నిజానికి కరెంట్ అఫైర్స్, రోజూ ఫాలో అవుతూ ఉంటేనే విషయం గురించి లోతైన సమాచారం లభించడంతో పాటు చదివిన విషయం ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రోజూ కరెంట్ అఫైర్స్‌ను కవర్ చేయడం సాధ్యం కాకపోతే నెలవారీగా విడుదలయ్యే కరెంట్ అఫైర్స్ బుక్‌లెట్స్‌ను ఫాలో అయితే మంచి ఫలితం ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల కరెంట్ అఫైర్స్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించి, ఎక్కువ విషయాలు తెలుసుకున్న వాళ్ళవుతారు. ఫలితంగా ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించిన వాళ్ళవుతారు. అంతిమంగా విజేతలవుతారు.
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...