మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానులు ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న ప్పుడు దక్షిణాపథంలో యాదవ, కాకతీయ, పాండ్య, హోయసాల రాజ్యాలు వర్థిల్లాయి. ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీకి దక్షిణాపథ రాజ్యాలను జయించాలనే కోరిక ఆనాడే కలిగింది.మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల యుగానికి ప్రత్యేక స్థానముంది. ఆంధ్రజాతికి రూపురేఖలు దిద్ది, తెలుగు మాట్లాడే ప్రజలను ఏకంచేసి కాకతీయులు పాలించారు. ఆంధ్రభాషా వాఙ్మయాలు, సంగీత, నృత్య, వాస్తు, చిత్ర, శిల్పకళలను అభివృద్ధి చేసిన కాకతీయుల పాలన ఒక గొప్ప యుగమని చెప్పవచ్చు.
వీరు రాచరిక వ్యవస్థనే సామాజిక వ్యవస్థగా రూపొందించారు. రైతుల క్షేమాన్ని గుర్తించి, నివాసయోగ్యం కాని అటవీ భూములను సస్యశ్యామలం చేశారు. తెలంగాణ ప్రాంతంలో గొప్ప చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. వీరు కొంతకాలం రాష్ర్టకూటులు, తూర్పు, పశ్చిమ చాళుక్యులకు సామంత సేనా నాయకులుగా ఉన్నారు. వీరు మొదట సబ్బినాడు, హనుమకొండ, కొలనుపాక, పిల్లలమర్రి, సతనాటి సీమ (మధిర ప్రాంతం), కొరి వి సీమ (వరంగల్- మానుకోట) ప్రాంతాలను పాలించారు. తర్వాత స్వతంత్రులై క్రీ.శ. 1000 నుంచి క్రీ.శ. 1323 వరకు తెలంగాణ ప్రాంత మంతటా రాజ్యాన్ని స్థాపించి, సుమారు 300 ఏళ్లు హనుమకొండ, ఓరుగల్లులను రాజధానులుగా చేసుకొని అఖిలాంధ్రదేశాన్ని పాలించారు. సామాజిక, భాషా, సాంస్కృతిక రంగాలకు గట్టి పునాది వేశారు.
పుట్టు పూర్వోత్తరాలు- శాసన, సాహిత్య ఆధారాలు
చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలు శాసనాలు. ఇవి ప్రామాణిక సమాచారాన్ని అందిస్తాయి. కాకతీయులకు సంబంధించిన సుమారు వెయ్యి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. కాకతీయ శాసనమనగానే అది ఒక దాన, ధర్మ, తటాక, ప్రతిష్టకు చెందిన శాసనం అని పేరుగాంచింది. వీరి చరిత్రలో మూడు మౌలిక శాసనాలు కీలకమైనవి. ఇందులో క్రీ.శ.956 నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడు వేయించిన మాంగల్లు శాసనం, క్రీ.శ.1163 నాటి హనుమకొండ శాసనం, క్రీ.శ.1220లో గణపతిదేవుడి సోదరి మైలాంబికాదేవి వేయించిన బయ్యారం శాసనం ముఖ్యమైనవి.
ఇవి కాకతీయుల పుట్టు పూర్వోత్తరాల గురించి వివరిస్తాయి. కాకతీయుల వంశం, కులం, పుట్టుక గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. వీరు మొదట పశ్చిమ సరిహద్దుల్లోని కాకతి అనే గ్రామం (కర్ణాటక ప్రాంతం) నుంచి ఆంధ్రదేశానికి వచ్చి, తూర్పు చాళుక్యుల కొలువులో ఉంటూ ఆంధ్రులయ్యారని డా మారేమండ రామారావు అభిప్రాయపడ్డారు. అయితే క్రీ.శ. 956లో తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు వేయించిన మాంగల్లు శాసనం ఆధారంగా ఆచార్య పి.వి. పరబ్రహ్మశాస్త్రి పరిశోధన ప్రకారం.. వీరు రాష్ర్టకూటులని నిర్ణయించారు. కాకతీయ రాజ్య మూలపురుషుడు కాకర్త్య గుండియగా పేర్కొన్నారు.
కీ.శ.1163లో కాకతీయ రుద్రదేవుడు హనుమకొండ శాసనం వేయించాడు. ఈ శాసనాన్ని 1882లో జె.ఎఫ్.ప్లేటో అనే ఆంగ్లేయుడు పరిశోధించి వెలుగులోకి తెచ్చాడు. ఈ శాసనంలో రెండో ప్రోలరాజు, అతని కుమారుడు కాకతి రుద్రదేవుడి విజయాల వర్ణన ఉంది.క్రీ.శ. 1220లో కాకతీయ గణపతి దేవుడి సోదరి మైలాంబికాదేవి, బయ్యారం అనే గ్రామంలో తన తల్లిపేరిట గొప్ప తటాకం (చెరువు) నిర్మించి అక్కడ శాసనాన్ని వేయించింది. శాసనంతోపాటు ఆమె గురువు ధర్మశివాచార్యుడి పేరిట శివపురం అనే నూతన గ్రామాన్ని కూడా నిర్మించింది. ఈ శాసనం ప్రకారం... కాకతీయ వంశ మూలపురుషుడు వెన్నయ నాయకుడు.
కాకతీయులు-వంశ నామం
కాకతీయ ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు. ఇతడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. ఇందులో ప్రతాపరుద్రుడికి చెందిన చారిత్రక అంశాలున్నాయి. కాకతీయుల కాలం నాటి ఆంధ్ర దేశాన్ని త్రిలింగ దేశమని పిలిచేవారు. త్రిలింగ దేశం అని విద్యానాథుడు వర్ణించాడు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం.. అనేవి త్రిలింగాలు. ఈ గ్రంథం ప్రకారం కాకతి అనే దుర్గాశక్తి ఏకశిలా నగరేశ్వరులకు (ఓరుగల్లు) కుల దేవతని, ఆమెను ఆరాధించడం వల్ల కాకతీయులుగా పేరొచ్చిందని పేర్కొన్నాడు.
వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామంలో కాకతమ్మకు సైవోడు ఏకవీర అని వర్ణించాడు. కాకతి అంటే కూష్మాండం లేదా గుమ్మడికాయ అని అర్థం. తొలి కాకతీయ రాజులు జైనమతాన్ని అవలంబించారు. జైన దేవత కుష్మాండినినే తర్వాత కాలంలో కాకతమ్మ (దుర్గగా) పూజించారు. కొందరు ఆ పేరుని తమ వంశ నామంగా ధరించినట్లు కన్పిస్తుంది. కాకతి అనే పురం నుంచి పాలించినందువల్ల వీరు కాకతీయులు అయ్యారని అనేక శాసనాలు తెలుపుతున్నాయి. అయితే కాకతీపురం ఎక్కడుందనే విషయం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. శాసనాల్లో కాకతి, కాకర్త్య, కాకతీయ, కాకేత అనే పదాలు రూపాంతరాలుగా కన్పిస్తున్నాయి.
బయ్యారం చెరువు శాసనం ప్రకారం.. ఈ వంశ స్థాపకుడైన వెన్నయ నాయకుడు కాకతిని రాజధానిగా పాలించాడని, అందువల్లే అతడి సంతతిని కాకతీయులుగా పిలిచారని తెలుస్తోంది. ఖాజీపేట శాసనంలో రెండో బేతరాజు తన తాత అయిన మొదటి బేతరాజును కాకతి పురాధినాథుడు అని పేర్కొన్నాడు. గణపతిదేవుడి గరికపాడు శాసనంలో కాకతీయులకు కాకతి అనే స్థలంతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ శాసనాధారాల వల్ల కాకతీయ అనే వంశనామం కాకతి అనే పురనామం వల్లే వచ్చిందని స్పష్టమవుతోంది.
కాకతీయులు - కులం
కాకతీయులు ఏ కులానికి చెందిన వారనే విషయం కూడా వివాదాస్పదమే! వీరు క్షత్రియులు లేదా చతుర్థ కులజులని చరిత్రకారుల అభిప్రాయం. గణపతిదేవుడి మోటుపల్లి, పాకాల, కాంచీపుర శాసనాలు వీరిని క్షత్రియులుగా, సూర్య వంశీయులుగా వర్ణించాయి. వీరు జన్మతా క్షత్రియులు కారని, చతుర్ధాన్వయ సంజాతులేనని, వీరి సన్నిహిత బంధువులందరూ చతుర్థ కులస్థులేనని, మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం. రాజ్యం చేపట్టిన తర్వాత, వీరు క్షత్రియత్వాన్ని ఆపాదించుకొని ఉండొచ్చని భావించారు.
రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో ప్రేమాభిరామం అనే నాటకాన్ని రచించాడు. దాని ఆధారంగా వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని తెలుగులో రచించాడు. దీన్ని శ్రీనాథ కవి రచించాడనే వాదన కూడా ఉంది. ఇందులో ఓరుగంటి నగర వర్ణన, ఆంధ్రనగరి ప్రస్థావన ప్రధానంగా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది వినుకొండ వల్లభరాయుడే! తర్వాత విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దీన్ని ఉటంకించాడని చెప్పొచ్చు. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్యుని చరిత్ర, బసవ పురాణం ద్విపద కావ్యాలు.
వీటిలో వెలనాటిలోని సనదవోలు, పానుగల్లు, అమరావతి, సంగమేశ్వరం, వెల్లటూరుల్లో పండితారాధ్యుడి పర్యటనలకు సంబంధించిన సంఘటనలను వర్ణించారు. కొలని గణపతిదేవుడు రచించిన శివయోగసారం గ్రంథంలో ఇందులూరి మంత్రుల చరిత్రను ప్రస్తావించారు. నీతిసారం గ్రంథం కాకతీ రుద్రదేవుడిదని, ప్రతాపరుద్రుడిదని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రంథం లభించడం లేదు. నీతిసార ముక్తావళి అనే గ్రంథాన్ని తెలుగులో చోడ బద్దెన రచించాడు.
మాదిరి ప్రశ్నలు
1. కాకతీయ వంశ మూల పురుషుడు? (శాసనాల ప్రకారం)
1) బేతరాజు 2) కాకర్త్య గుండియ
3) మొదటి ప్రోలరాజు
4) వెన్నయ నాయకుడు
2. హనుమకొండ వేయిస్తంభాల దేవాలయ నిర్మాణం ఏ కాకతీయ రాజు కాలంలో ప్రారంభ మైంది?
1) గణపతి దేవుడు
2) రుద్ర దేవుడు
3) ప్రతాపరుద్రుడు
4) రెండో బేతరాజు
3. వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఏ కాకతీయ రాజు కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించాడు?
1) రాణీ రుద్రమదేవి
2) ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు
4) రుద్ర దేవుడు
4. వరంగల్‌ను సుల్తాన్‌పూర్‌గా ఎవరు మార్చారు?
1) మాలిక్ కపూర్
2) ఘియాసుద్దీన్ తుగ్లక్
3) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
4) మహ్మద్ బిన్ తుగ్లక్
5. పతాపరుద్ర యశోభూషణం రచయిత?
1) సాయన 2) విద్యానాథుడు
3) పాల్కూరికి సోమనాథుడు
4) మడికి సింగన
6. రాయగజకేసరి బిరుదున్న కాకతీయ రాజు?
1) గణపతి దేవుడు 2) రుద్రదేవుడు
3) రెండో ప్రోలరాజు
4) మహాదేవుడు
7. వినయ విద్యాభూషణుడు అనే బిరుదున్న రాజు?
1) రుద్రదేవుడు 2) మహాదేవుడు
3) ప్రతాప రుద్రుడు 4) గణపతి దేవుడు
8. వర్తకుల సంరక్షణ కోసం మోటుపల్లి అభయ శాసనాన్ని ఎవరు వేయించారు?
1) ప్రతాప రుద్రుడు
2) రుద్రమ దేవి
3) గణపతి దేవుడు
4) మొదటి ప్రోలరాజు
9. సేనాని రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్య భార దౌరేయుడు అనే బిరుదును ఎవరిచ్చారు?
1) గణపతి దేవుడు 2) రెండో బేతరాజు
3) రెండో ప్రోలరాజు
4) ప్రతాప రుద్రుడు
10. చలమర్తిగండడు అనే బిరుదున్న రాజు?
1) రెండో ప్రోలరాజు 2) ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) రెండో బేతరాజు
11. ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశమని వర్ణించిన కవి?
1) శ్రీనాథుడు 2) పోతన
3) పాల్కూరికి సోమనాథుడు
4) విద్యానాథుడు
12. కాకతీపురాధినాథ బిరుదున్న కాకతీయ రాజు?
1) రెండో బేతరాజు 2) రుద్రదేవుడు
3) మొదటి బేతరాజు
4) మొదటి ప్రోలరాజు
13. కీ.శ. 1182లో జరిగిన పల్నాటి యుద్ధ సమయంలో నలగామ రాజుకు ఏ కాకతీయ రాజు సైన్య సహకారం అందించాడు?
1) మహా దేవుడు
2) గణపతి దేవుడు
3) మొదటి ప్రోలరాజు
4) రుద్ర దేవుడు
14. ఏ కాకతీయ రాజు కాలంలో రాజధాని హనుమకొండ నుంచి వరంగల్‌కు మారింది?
1) గణపతి దేవుడు
2) రుద్రమదేవి
3) రెండో బేతరాజు
4) మొదటి ప్రోలరాజు
15. కీ.శ. 1213లో సేనాని రేచర్ల రుద్రుడు ఏ కాకతీయరాజు కాలంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు?
1) రుద్ర దేవుడు
2) గణపతి దేవుడు
3) ప్రతాపరుద్రుడు
No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...