కమిషన్ కార్యదర్శి చారుసిన్హా వెల్లడి ( Sakshi News paper - 28/02/2014)
సీమాంధ్ర, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విభజన ఉంటుందని కమిషన్ కార్యదర్శి చారుసిన్హా పేర్కొన్నారు. గురువారం ఆమె అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో 15వేల నుంచి 20వేల వరకు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే సీమాంధ్ర, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాతే వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు అప్పటి ఖాళీలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అదనపు ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా వీఆర్వో పరీక్షలను నిర్వహించి, తక్కువ సమయంలోనే ఫలితాలను ప్రకటించామన్నారు. పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియను సైతం త్వరగా ముగిస్తామని చెప్పారు.
Advertisements