Advertisements

April 27, 2014

PSLV - Polar Satellite Launch Vehicle (Telugu Medium)

పీఎస్‌ఎల్‌వీ(పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) వాహక నౌక భారత్‌కు నమ్మిన బంటు. ఆ ఉపగ్రహ వాహక నౌకతో జరిపిన ప్రయోగాల్లో మొదటిది తప్ప మిగతావన్నీ విజయవంతమయ్యాయి. అందుకే దీనిని భారత్‌కు నమ్మిన బంటు అంటున్నారు. 

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను సంక్షిప్తంగా పీఎస్‌ఎల్‌వీ అని వ్యవహరిస్తారు. ఈ ఉపగ్రహ వాహకనౌకతో 2014, ఏప్రిల్ వరకు మొత్తం 26 ప్రయోగాలు జరిపారు. అందులో 25 ప్రయోగాలు విజయవంతం చేసిన పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ఇస్రో జవనాశ్వంగా భాసిల్లుతోంది. ఇందులో పీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ-సీఏ, పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్(ఎక్స్‌ట్రా లార్జ్) అనే వర్షన్లను ఇప్పటివరకు ప్రయోగించారు. వర్షన్ మారినకొద్ద్దీ ఈ రాకెట్లలో కొన్ని అభివద్ధికరమైన మార్పులు చేస్తూ వచ్చారు. 1993, సెప్టెంబర్‌లో తొలిసారిగా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీకి 1,678 కిలోలపైగా బరువున్న ఉపగ్రహాలను భూమికి 620 కి.మీ. ఎత్తున కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్ధ్యముంది. పీఎస్‌ఎల్‌వీ-సీఏ, 1,100 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని భూమికి 622 కిలోమీటర్ల ఎత్తున సూర్యఅనువర్తన ధవ కక్ష్య(sun synchronous orbit)లోకి ప్రవేశపెట్టగలదు. ఇందులో సీఏ అంటే కోర్ ఎలోన్ అని అర్థం. దీన్ని 2007, ఏప్రిల్ 23న మొదటగా ప్రయోగించారు. ఇక పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ విషయానికొస్తే 2008, అక్టోబర్‌లో తొలిసారిగా ప్రయోగించారు. దీని పేలోడ్ సామర్థ్యం 1,800 కిలోలకు పైగానే ఉంటుంది. ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీ-హెచ్‌పీ వర్షన్ అభివద్ధి దశలో ఉంది. దీని ద్వారా 2,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే వీలుకలుగుతుంది. 

ఇప్పటి వరకు తయారుచేసినవి నాలుగు దశల మోటార్లు కలిగిన పీఎస్‌ఎల్‌వీలు కాగా ఇక 3 దశల మోటర్లు కలిగిన పీఎస్‌ఎల్‌వీల తయారీ ప్రతిపాదన కూడా ఇస్రో పరిశీలనలో ఉంది. వీటి ద్వారా 500 కిలోల నుంచి లియో ఉపగ్రహాల వరకు అంతరిక్షంలో ప్రవేశపెట్టవచ్చు. లియో ఉపగ్రహాలంటే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలని అర్థం. అంటే భూమి ఉపరితలం నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కక్ష్యనే లియో అని వ్యవహరిస్తారు. ఇక పీఎస్‌ఎల్‌వీ విషయానికి వస్తే ఇది మొత్తం 44 మీటర్ల పొడవు, 295 టన్నుల బరువు కలిగి ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీలో మొత్తం నాలుగు దశలుంటాయి. వీటిలో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించే దశలు సమాంతరంగా అమర్చి ఉంటాయి. తొలి దశలో ప్రపంచంలోనే అతి పెద్ద ఘన ఇంధనాన్ని కలిగిన బూస్టర్లు పీఎస్‌ఎల్‌వీకి అమర్చి ఉంటా యి. ఇందులో 139 టన్నుల ఇంధనాన్ని నింపవచ్చు. రెండో దశలో వికాస్ ఇంజన్‌ను ఉపయోగిస్తారు. ఇందులో 41.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు. మూడో దశలో ఉపయోగించే హెచ్‌టీబీపీ మోటార్‌లో ఏడు టన్నుల ఘన ఇంధనాన్ని వాడుతారు. ఇక పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశలో రెండు ద్రవ ఇంధన మోటార్లను ఉపయోగిస్తారు. ఒక్కోదాంట్లో రెండు టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు.




వీటిలో మోనోమిథైల్ హైడ్రోజన్‌ను ఇంధనంగా, ఇంకా నత్రజని మిశ్రిత ఆక్సైడ్‌లను ఆక్సీడైజర్‌గా ఉపయోగిస్తారు. తొలి దశ మోటారుకు ఆరు స్ట్రాపాన్‌లను కలిపి ఉంచుతారు. వీటిలో నాలుగింటిని భూమిపైనుంచి నౌకను ప్రయోగించే సమయంలో మండిస్తారు. 2014, ఏప్రిల్ 4వ తేదీ వరకు మొత్తం 25 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఒకటి మాత్రమే విఫలమైంది. ఈ ఉపగ్రహం బహుళ పేలోడ్‌లను ఏక కాలంలో తీసుకెళ్లి భూ స్థిరకక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చంద్రయాన్-1 సందర్భంగా మరింత విస్తత పరిచిన స్ట్రాపాన్ మోటార్లను, పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌లో ఉపయోగించారు. అంతేకాకుండా పేలోడ్ సామర్థ్యాన్ని 1,750 కిలోలకు, సూర్య అనువర్తన స్థిరకక్ష్యను 620 కిలోమీటర్లుకు పెంచారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల డిజైన్, అభివద్ధి తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరుగుతుంది. ఇందులో వాడే ఘన ఇంధన మోటార్ల అభివద్ధి, తయారీ.. షార్ (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్)లో జరుగుతుంది. ఈ రాకెట్ల ప్రయోగాలను షార్ నిర్వహిస్తుంది. 2013, నవంబర్ 5వ తేదీన మార్స్ ఆర్బిటాల్ మిషన్ (మంగళయాన్)ను పీఎస్‌ఎల్‌వీ-సీ25 విజయవంతంగా ప్రయోగించి రజతోత్సవం జరుపుకుంది. ఇందులో పీఎప్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రకాన్ని వాడారు. ఈ రకం వాడకం ఇది ఐదోసారి. తర్వాత తాజా ప్రయోగంలో దీన్ని ఆరోసారి ఉపయోగించారు. 
Also Read:
  1. Transgenic Animals - Methods of Transgensis , Applications of Transgenic Animals.
  2. Important Space Mission in History of World
  3. INS Arihant -first nuclear submarine of ATV Project started in 1974
  4. INS Chakra 2 nuclear submarine -Can it boosts Indian Navy?
  5. DRDO Tests Autonomous Underwater Vehicle
  6. Naval Accidents which shattered the image of India Navy
  7. INS Sindhurakshak know its facts - Sinks in Aug 2013
  8. What is meant by criticality in nuclear reactors?


Advertisements

No comments:

Followers