Andhra
History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P
History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group
2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download,
Andhra Pradesh Public Service Commission Material for Groups.
Andhra
History Other Important Notes
|
|
9) Kakatiyas
12) Bahamani Kingdom
|
విజయనగర సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం-రాజవంశాలు
సాళువ వంశం (క్రీ.శ. 1486-1505)
సంగమ వంశంలో రెండో దేవరాయల మరణానంతరం రాజులైన వారు అసమర్థులు కావడంతో విజయనగర శత్రువులైన బహమనీ సుల్తానులు, ఒరిస్సా గజపతులు విజృంభించి, విజయనగర రాజ్యభాగాలను ఆక్రమించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాళువ వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్టించారు. వీరు కర్ణాటకలోని కళ్యాణి ప్రాంతానికి చెందినవారు. బహుశా ముస్లింల దండయాత్రల కాలంలో వీరు విజయనగర రాజ్యానికి వలసవచ్చి ఉంటారని అంచనా.
కర్నూలు - చంద్రగిరి ప్రాంతాల్లో వీరి రాజకీయ ప్రాబల్యం ప్రారంభమైంది. ఈ వంశానికి చెందిన మంగిరాజుకు ‘సాళువ’ అనే బిరుదు వుంది. ఇతడి తర్వాత గుండరాజు కళ్యాణి ప్రాంతానికి మొదట రాజప్రతినిధి అయ్యాడు. గుండరాజు కుమారుడు సాళువ నరసింహరాయలు. ఇతడు సంగమ వంశానికి చెందిన విరూపాక్ష రాయల కాలంలో సామంతుడిగా పనిచేశాడు. ఇతడు క్రీ.శ. 1485లో సంగమవంశ చివరి రాజైన ఫ్రౌడరాయల నుంచి విజయనగర రాజ్యాన్ని ఆక్రమించాడు. సాళువ నరసింహారాయల ఆస్థానంలో సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాసిన రాజనాథ డింఢిముడు, తెలుగులో శృంగార శాకుంతలం, జైమినీ భారతం రాసిన పిల్లల మర్రి పినవీరభద్రుడు ప్రముఖంగా వెలుగొందాడు. సాళువ నరసింహరాయలకు రాయమహారసు అనే బిరుదు ఉంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకీర్తనా, సంకీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుడు ఇతడికి సమకాలికుడే! సాళువ నరసింహరాయలను విజయనగర రాజ్య మొదటి దురాక్రమదారుడిగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.
ఇతడు విజయనగర రాజ్య గౌరవ ప్రతిష్టలను, శాంతి భద్రతలను నెలకొల్పాడని చెప్పొచ్చు. ఇతడి పరిపాలనా కాలం 15 సంవత్సరాలు ఆ ఆశయ సాధనలోనే గడిచిపోయింది. సాళువ నరసింహరాయల తర్వాత తిమ్మరాయడు, ఇమ్మడి నరసింహరాయలు పాలించారు. ఇమ్మడి నరసింహరాయలు రాజైనప్పటికీ అధికారమంతా అతడి సైన్యాధ్యక్షుడైన తుళువ నరస నాయకుడి చేతిలోనే ఉండేది. క్రీ.శ.1503లో తుళువ నరస నాయకుడు మరణించాడు. తర్వాత క్రీ.శ.1505 లో అతడి కుమారుడు వీర నరసింహుడు, తండ్రిని వధించి, సింహాసనం అధిష్టించి తుళువ వంశాన్ని స్థాపించాడు.
తుళువ వంశం (క్రీ.శ. 1505-1576):
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడో రాజవంశం తుళువ వంశం. మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థానం. అందుకే తుళువ వంశమని పేరొచ్చింది. దీన్ని వీరనరసింహరాయలు క్రీ.శ.1505లో స్థాపించాడు. క్రీ.శ.1509 వరకు రాజ్యమేలాడు. పాలించిన ఐదేళ్లూ యుద్ధాలతోనే గడిచిపోయింది. వీర నరసింహరాయలు వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజుగా ప్రసిద్ధి పొందాడు. ఉమ్మెత్తూర్ పాలకులను అణచివేసే ప్రయత్నంలో క్రీ.శ.1509లో మరణించాడు. తర్వాత ఆయన సవతి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరుసు సహాయంతో క్రీ.శ. 1509లో సింహాసనాన్ని అధిష్టించాడు.
శ్రీకృష్ణ దేవరాయలు (క్రీ.శ.1509-1529):
విజయనగరాన్ని పాలించిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు. మహావీరుడు, విజేత, పాలనాదక్షుడు, రాజనీతిపరుడు, కావ్యస్రష్ట. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి గాంచాడు.
బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షాను వధించి, కోవిలకొండను జయించాడు. బీదర్‌లో మంత్రి బరీద్ చేతిలో బందీైయెున బహమనీ సుల్తాన్ మహ్మద్ షాను విడిపించి, అతడికి సింహాసనాన్ని అప్పగించాడు. దీంతో యవనరాజ్యస్థాపనాచార్య అనే బిరుదు పొందాడు. ఉమ్మెత్తూర్, శివసముద్రం, పెనుగొండ దుర్గాలను జయించాడు. దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదును పొందాడు. కొండపల్లి, కొండవీడు, రాజమహేంద్రవరం, కళింగలోని ఉదయగిరులను జయించాడు. విశాఖ జిల్లాలోని పొట్నూరు వద్ద విజయస్తంభాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో మైత్రి చేసుకొని, శక్తివంతమైన గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. భత్కల్ కోటలు కట్టుకోవడానికి పోర్చుగీసు వారికి రాయలు అనుమతి ఇచ్చాడు. క్రీ.శ. 1509లో పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకొన్నారు.
ఒరిస్సా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర - తెలంగాణ ప్రాంతాల్లోని అనేక దుర్గాలను శ్రీకృష్ణదేవరాయలు జయించాడు. వాటిలో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి దుర్గాలు దుర్భేద్యమైనవి. రాయలు కళింగపై చేసిన దండయాత్ర క్రీ.శ.1513లో ప్రారంభమై క్రీ.శ.1519 వరకు కొనసాగింది. ప్రతాపరుద్ర గజపతి (ఒరిస్సా) కుమార్తె అన్నపూర్ణాదేవిని దేవరాయలు వివాహామాడాడు. అమరావతి, శ్రీకాకుళం (ఆంధ్రమహా విష్ణువు కృష్ణాజిల్లా),అహోబిలం, శ్రీశైలం, తిరుపతి, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించి, తన విజయాలకు కృతజ్ఞతగా దేవతలకు విలువైన ఆభరణాలు, పలు కానుకలను సమర్పించాడు. శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తుడు. తిరుపతి దేవాలయంలో సుమారు 50 శాసనాలు వేయించాడు. క్రీ.శ.1513 నుంచి క్రీ.శ. 1524 మధ్య కాలంలో తన రాణులు తిరుమలదేవి, చిన్నాదేవిలతో కలిసి స్వామిని ఏడుసార్లు దర్శించుకున్నాడు. అనేక వజ్ర వైఢూర్యాలు, వేలాది బంగారు వరహాలను కానుకలుగా సమర్పించాడు.
అష్టదిగ్గజాలు:
కృష్ణదేవరాయలు ఆంధ్ర సాహిత్యానికి చేసిన మహోన్నత సేవల వల్ల ఆంధ్రభోజుడు అనే బిరుదును పొందాడు. ఈయన సాహిత్య మండపం భువన విజయంగా పేరు పొందింది. సంస్కృత, కన్నడ, తెలుగు కవులను ఆదరించాడు. తెలుగుభాషలో పంచకావ్యంగా పేరొందిన ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయం)ను రచించాడు. సంస్కృత భాషలో జాంబవతీ పరిణ యం, మదాలస చరిత్ర, సత్యవధూప్రమాణం వంటి గ్రంథాలను రచించాడు. కృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి తెలుగులో మారీచి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది. ఇతడి ఆస్థాన కవి, ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన మనుచరిత్రను రచించాడు.
దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. వారిలో నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించాడు. పెద్దన, తిమ్మన, అయ్యల రాజరామభద్రుడు, మాధవగారి మల్లన, సూరన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి.. వీరంతా అష్టదిగ్గజకవులుగా ప్రఖ్యాతి చెందారు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ పేరుతో నాగలాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న బండారు లక్ష్మీనారాయణ కవి సంస్కృతంలో సంగీత సూర్యోదయం అనే గ్రంథం రచించా డు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం రచించాడు.
శ్రీకృష్ణ దేవరాయలు హంపీలో హజరా రామస్వామి, కృష్ణ స్వామి ఆలయాలను నిర్మించాడు. విజయనగర రెండో రాజధానిగా పేరుగాంచిన పెనుగొండలో తిమ్మరాజు బంధిఖానా, తిమ్మరాజు బురుజు, గగన్‌మహల్ (వేసవి విడిది) అనే రాజ ప్రాసాదాన్ని నిర్మించాడు. వీటితోపాటు అనేక ప్రాంతాల్లో రాయగోపురాలు, మండపాలను నిర్మించాడు. అనేక కవులు ఇతడిని సంగీత, సాహిత్య, సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజ, దక్షిణ సముద్రాధీశ్వర, యవన రాజ్య స్థాపనాచార్య, మూరు రాయడగండ అనే విశేష బిరుదులతో సత్కరించారు.
శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ.1529లో మరణించాడు. తర్వాత అచ్యుత రాయలు, వెంకటపతిరాయలు రాజ్యానికొచ్చారు. వెంకటపతిరాయలు దుర్మార్గుడు కావడంతో ఆయనని తప్పించారు. కృష్ణ దేవరాయలకు అల్లుడైన అళియరామరాయలు, తర్వాత సదాశివరాయలు రాజ్యాన్ని పాలించారు. సదాశివరాయలు పేరుకు మాత్రమే ప్రభువు. సర్వాధికారాలన్నీ అళియరామరాయలే చెలాయించాడు. అళియ రామరాయలు, ఐదుగురికి(పంచ పాదుషాలు) మధ్య క్రీ.శ.1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అళియరామ రాయలు మరణించాడు. విజయనగర రాజు సదాశివరాయలు పెనుగొండకు పారిపోయాడు. దీంతో తుళువ వంశం అంతమైంది.
ఆరవీటి వంశం:
విజయనగర రాజ్యాన్ని పాలించిన చివరి వంశం ఆరవీటి వంశమే. రాక్షస తంగడి యుద్ధానంతరం తిరుమల రాయలు క్రీ.శ.1570లో పట్టాభిషేకం చేసుకొని, పెనుగొండ రాజధానిగా ఆరవీటి వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో ప్రసిద్ధుడు రెండో వెంకటపతిరాయలు. క్రీ.శ.1585లో రాజ్యానికొచ్చాడు. క్రీ.శ.1614 వరకు పాలించాడు. ఇతడు బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధం చేసి, వారు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత సామంతరాజుల తిరుగుబాటు వల్ల రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చాడు. చివరకు క్రీ.శ.1652లో గోల్కొండ సుల్తానుకు, మూడో రంగరాయలకు వందవాసి దగ్గర జరిగిన యుద్ధంలో రంగరాయల ఓటమితో విజయనగర మహాసామ్రాజ్యం పరిసమాప్తమైంది.
విజయనగర సామ్రాజ్యం-విశిష్టత
రాజవంశాలు
మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1356-1377):
హరిహరుడి తర్వాత మొదటి బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతడు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కుమారుడు కంపరాయలు (కుమార కంపన) తమిళనాడులోని మధురను జయించి, విజయనగర రాజ్యంలో విలీనం చేశాడు. క్రీ.శ. 1325లో ఢిల్లీ సామంతులుగా మధురను పాలించిన ముస్లింలు మధుర రాజ్యాన్ని స్థాపించారు. వీరికాలంలో రామేశ్వరం, మధుర, శ్రీరంగం మొదలైన పుణ్యక్షేత్రాల్లో ప్రజలు అనేక బాధలను అనుభవించారు. కుమార కంపన భార్య గంగాంబ (లేదా) గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని క్రీ.శ. 1371లో రచించింది. ఇందులో కంపన దిగ్విజయాన్ని, బుక్కరాయల పాలనా విశేషాలను గంగాదేవి వర్ణించింది. అప్పటికే తిరుపతిలో దాచిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని శ్రీరంగంలో కంపన పునఃప్రతిష్టించాడు. మొదటి బుక్కరాయలు క్రీ.శ. 1374లో చైనా దేశానికి రాయబారిని పంపినట్లు మింగ్ వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. మొదటి బుక్కరాయలకు, బహమనీ సుల్తాన్ ‘మహ్మద్‌షాకు’ మధ్య జరిగిన ముద్గల్ కోట యుద్ధంలో మొదటిసారిగా ఫిరంగి దళాన్ని ఉపయోగించారు. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలియుద్ధం ఇదే. మొదటి బుక్కరాయలు... రెడ్డిరాజైన అనవోతారెడ్డిని ఓడించి, ఉదయగిరి, వినుకొండ, అహోబిలం దుర్గాలను జయించాడు. క్రీ.శ. 1366లో రేవతీ ద్వీపాన్ని(గోవా) బుక్కరాయల మంత్రి మాధవ మంత్రి ఆక్రమించాడు. శ్రీరంగపట్టణంలో జైనులకు - వైష్ణవులకు మధ్య వివాదాల్ని మొదటి బుక్కరాయలు పరిష్కరించాడు. ఇతడు వైదిక ధర్మాన్ని ప్రోత్సహించాడు. ధర్మపాలనలో బుక్కరాయలు మనువువంటి వాడని గంగాదేవి తన మధురా విజయంలో వర్ణిం చింది. వేద భాష్యకారుడైన శాయణాచార్యుడు, ఉపనిషత్ ప్రవర్తకుడైన మాధవుడు ఇతడి మంత్రులుగా పనిచేశారు. మొదటి బుక్కరాయలకు వైదిక మార్గ ప్రవర్తక, వేదమార్గ ప్రతిష్టాప క అనే బిరుదులు ఉన్నాయి. తెలుగు కవి నాచన సోమనాథుడిని బుక్కరాయలు ఆదరించాడు.
రెండో హరిహర రాయలు (క్రీ.శ. 1377 - 1404):
మొదటి బుక్కరాయల తర్వాత రెండో హరిహర రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించాడు. రాజ్యాన్ని ఇతడే ఎక్కువ కాలం పరిపాలించాడు. ఇతడు కొండవీటి రెడ్లు, రేచర్ల పద్మనాయకులతో యుద్ధాలు చేశాడు. పానగల్లును ఆక్రమించాడు. సింహళ దేశంపై దాడిచేసిన మొదటి విజయనగర రాజు రెండో హరిహర బుక్కరాయలే!
రెండో హరిహరుడు తన హయాంలో రాజ్యపాలనలో అనేక మార్పులు చేశాడు. ఇతడి కంటే ముందు రాజ్యపాలనలో దాయాదులు ప్రధాన పాత్ర వహించేవారు. రెండో హరిహరుడు వారిని తొలగించి, తన కుమారులను నియమించాడు. ఉదాహరణకు ఉదయగిరిలో దేవరాయలు, మధురలో విరూపాక్షుడు, ముల్‌భాగల్‌లో యువరాజైన రెండో బుక్కరాయలను నియమించాడు. విధేయులైన వారికే ప్రాధాన్యతనిచ్చి కేంద్రాధికారాన్ని అప్పగిం చాడు. రెండో హరిహరుడికి మహామండలేశ్వర, రాజాధిరాజ, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి కాలంలో వర్షాభావం వల్ల దక్షిణాధిలో తీవ్ర కరవు సంభవించింది. దీంతో మహారాష్ర్ట, తెలంగాణ తీవ్ర నష్టానికి గురయ్యాయి. మహారాష్ర్టలో దీన్ని దుర్గాదేవి కరువు అని వ్యవహరించేవారు. దీని ప్రభావం 12 సంవత్సరాలు (క్రీ.శ. 1391-1403) వరకు ఉందని అప్పటి రచనల్లో పేర్కొన్నారు. బహమనీ సుల్తాన్ రెండో మహ్మద్‌షా కరవు నివారణకు కృషిచేసినట్లు తెలుస్తోంది. రెండో హరిహరుడి మరణానంతరం (1404) విజయనగర చరిత్రలో మొదటిసారిగా వారసత్వ కలహాలు జరిగాయి. యువరాజుగా ఉన్న బుక్కరాయలను కాదని విరూపాక్షుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. రెండో బుక్కరాయల్ని తొలగించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్నాడు.
మొదటి దేవరాయలు (క్రీ.శ. 1406-1422):
మొదటి దేవరాయల కాలం యుద్ధాలతో గడిచిపోయింది. రెండో బుక్కరాయల్ని ఓడించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు రాజ్యానికొచ్చాడు. ఇతడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఫిరోజ్‌షాకిచ్చి వివాహం చేసినట్లు, బంకపూర్ అనే ప్రాంతాన్ని కట్నంగా ఇచ్చినట్లు ఫెరిష్టా రచనల ద్వారా తెలుస్తోంది. మొదటి దేవరాయలు రాజమహేంద్రవరం యుద్ధంలో పెదకోమటివేమారెడ్డిని ఓడించాడు. విజయనగర ప్రాకారాలను పటిష్టపరచి అనేక బురుజులను నిర్మించాడు. తుంగభద్రానదికి ఆనకట్ట వేయించి, 15 మైళ్ల కొండ ప్రాంతాన్ని తొలిపించి, కాలువల ద్వారా విజయనగరానికి నీటి సౌకర్యం కల్పించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించిన తొలి పాలకుడిగా దేవరాయలు పేరు పొందాడు.
ఇతని కాలంలోనే ఇటలీ యాత్రికుడు నికోలో - డి- కాంటే విజయనగర రాజ్య వైభవాన్ని వర్ణించాడు. దేవరాయల తర్వాత అతడి కుమారులైన రామచంద్రరాయలు, విజయరాయలు స్వల్ప కాలం రాజ్యమేలారు.
రెండో దేవరాయలు (క్రీ.శ. 1426-1446):
రెండో దేవరాయలు సంగమ వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలుస్తారు. ఇతడికి గజబేంతకార (ఏనుగుల వేటలో నేర్పరి) అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలో విజయ నగర రాజ్యం గొప్పగా విస్తరించింది. క్రీ.శ. 1428 నాటికి తీరాంధ్ర ప్రాంతాలైన కొండవీడు, సింహాచలం వరకు విస్తరించిన రెడ్డిరాజ్యాన్ని జయించి, సామంత రాజ్యంగా చేసుకున్నాడు. ఇతడి కాలంలోనే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
రెండో దేవరాయలు తన సైన్యాన్ని పటిష్టం చేసేందుకు మొదటిసారిగా అధిక సంఖ్యలో మహమ్మదీయులను సైన్యంలో చేర్చుకున్నాడు. అహమ్మద్ షా బహమనీ, అతని కుమారుడు రెండో అల్లాఉద్దీన్ బహమనీషాలతో రెండుసార్లు యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాల్లో దేవరాయలు పరాజయం పొంది బహమనీలకు నష్టపరిహారం చెల్లించి సంధి చేసుకున్నాడు.
రెండో దేవరాయలు తన రాజ్యాన్ని ఉత్తరాన గుల్బర్గా నుంచి దక్షిణాన సింహళం వరకు, తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన మలబార్ వరకు విస్తరించాడు. పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు. అబ్దుల్ రజాక్‌ను పారశీక రాజు ఖుస్రూ పంపాడు. రెండో దేవరాయలు శైవమతాభిమాని అయినప్పటికీ, ముస్లింలకు మతస్వేచ్ఛనిచ్చాడు. తురక వాడలు నిర్మించాడు. కన్యాశుల్కాన్ని నిరుత్సాహపర్చి, కన్యాదాన సంప్రదాయాన్ని పాటించాడు. రెండో దేవరాయలు స్వయంగా కవి, పండితుడు. సంస్కృత భాషలో మహానాటక సుధానిధి, భాష్యాలపై వృత్తి అనే వ్యాఖ్యానం రాశాడు. సంస్కృత కవి అరుణగిరినాథ డిండిముడు ఇతడి ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇతడినే శ్రీనాథుడు పండిత గోష్టిలో ఓడించి దేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్నాడు.
వీరశైవుడైన కన్నడ రచయిత చామరసు.. రెండో దేవరాయల పోషణలో ప్రభులింగలీల అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడి మంత్రి ప్రోలుగంటి తిప్పన.. విఠలస్వామి దేవాలయానికి భోగమండపం నిర్మించాడు. జైనమతస్థులు, దేవరాయల అనుమతితో పాన్‌సుపారీ బజార్‌లో జైనాలయం నిర్మించారు. రెండో దేవరాయలు ముత్యాలశాల పేరుతో సాహిత్య సమావేశాలను నిర్వహించేవాడు.
దేవరాయల తర్వాత అతని కుమారుడు రెండో విజయరాయలు, అతడి కుమారుడు మల్లికార్జునుడు క్రీ.శ. 1447 వరకు పాలించారు. ఈ కాలంలో విజయనగర శత్రురాజులైన బహమనీలు, ఒరిస్సా గజపతులు విజయనగరంపై దాడులు ప్రారంభించారు. చివరకు క్రీ.శ. 1485లో విరూపాక్షరాయల కాలంలో సంగమవంశం అంతమైంది.
క్రీ.శ.1336లో స్థాపించిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశ చరిత్రలో విశేష మైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇస్లాం మత తాకిడి నుంచి సుమారు మూడు శతాబ్దాల పాటు దక్షిణ భారత దేశ సంస్కృతిని కాపాడిన ఘనత ఈ సామ్రాజ్యానిదే! ఈ కాలంనాటి పరిపాలన, సామాజిక, మత, ఆర్థిక పరిణామాలు తదనంతర కాలం నాటి చరిత్రను ప్రభావితం చేశాయి.
దక్కనులో మరాఠీ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చాయి. విజయనగర రాజుల సమకాలికులైన బహమనీ సుల్తానులు నిరంతరం వీరితో యుద్ధాల్లో మునిగితేలారు. దీంతో బహమనీలు ఉత్తర భారతదేశంపై దృష్టి సారించలేకపోయారు. తత్ఫలితంగా అక్కడ మొఘల్ సామ్రాజ్యం విస్తరించింది. దక్షిణ భారతదేశంలోని తెలుగు, కన్నడ, తమిళ భాషా ప్రాంతాల్లో ప్రజల మధ్య సాంస్కృతిక, మత సామరస్యం ఏర్పడింది.
పరిపాలనా వ్యవస్థ: విజయనగర సామ్రాజ్యంలోని వివిధ అంశాలను విశదీకరించే శిలా, తామ్ర శాసనాలు లక్షా 40 వేల చదరపు మైళ్ల విస్తీర్ణ ప్రాంతంలో లభించాయని అమెరికా చరిత్రకారుడు బర్టన్ స్ఫెయిన్ వివరించాడు. రాబర్‌ట సూయల్ రచించిన ‘విస్మృత సామ్రాజ్యం - విజయనగరం’ అనే గ్రంథం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ కాలంనాటి రాజనీతి పరిస్థితులను శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన ఆముక్తమాల్యద, మాధవాచార్యులు రచించిన పరాశర మాధవీయం, సకల నీతి సమ్మతం వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి. పయస్, న్యూనిజ్, నికోలా-డి-కాంటే రచించిన యాత్రా కథనాలు అప్పటి యథార్థ పరిస్థితులను తెలియజేస్తున్నాయి. విజయనగర రాజ్యంలో సంప్రదాయక రాచరిక పాలనా విధానమే అమల్లో ఉండేది. వీరు ప్రాచీన హిందూ రాజనీతిని అనుసరించి పాలించారు. కొద్దిపాటి మార్పులతో ప్రాచీన చోళుల పరిపాలనను అనుసరించినట్లు తెలుస్తోంది.
రాజ్యపాలనలో రాజే పాలనాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు, సర్వన్యాయాధిపతి. సర్వాధికారాలు రాజు చేతిలో కేంద్రీకృతమైనప్పటికీ విజయనగర పాలకులు నిరంకుశంగా వ్యవహరించలేదు. రాజ్యాధికారం వారసత్వ హక్కుగా కొనసాగినప్పటికీ రాజ్య సంరక్షణ కోసం కొన్ని సమయాల్లో అసమర్థులు, వ్యసనపరులైన రాజులను పదవి నుంచి తొలగించారు. సంగమ వంశ విరూపాక్షుడు, సాళువ వంశ ఇమ్మడి నరసింహరాయడు, తుళువ వంశ వెంకటపతిరాయలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆంతరంగిక పోరాటాలతో రాజవంశాలు మారాయి. రాజు పిన్న వయస్సు వాడైతే, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రాజ్య సంరక్షకుడిని నియమించేవారు. రాజు ప్రతిరోజూ గూఢచారులు, దండనాయకులు, సంప్రతులతో చర్చించేవారు. రాజాస్థాన కొలువులో తరచుగా రహస్య సమావేశాలను నిర్వహించేవారు. రెండో దేవరాయల సభా భవనమైన ముత్యాల శాలను శ్రీనాథుడు తన రచనల్లో ప్రస్తావించాడు. శ్రీకృష్ణదేవరాయల సభకు భువన విజయం అని, అచ్యుత దేవరాయల సభకు వెంకట విలాస మండపమని పేర్లున్నాయి. ఈ సభా మండపాల్లో విద్వత్ గోష్టులు కూడా జరిగేవి.
మంత్రి మండలి: రాజ్యం సప్తాంగ సమన్వితం, రాజుకు సలహాలివ్వడానికి మంత్రి పరిషత్ ఉండేది. దీనికి అధ్యక్షుడు ప్రధాన మంత్రి. మంత్రి పరిషత్తులో సభ్యులుగా ప్రధానమంత్రి, మంత్రులు,రాజ బంధువులు, ఉన్నతోద్యోగులు ఉంటారు. ప్రధానమంత్రిని సభా నాయక, తంత్రనాయక, కార్యకర్త అని కూడా పిలుస్తారు. ప్రాచీన ధర్మ శాస్త్రాలు, ఆచార వ్యవహారాలు, ప్రజాభిప్రాయం, మంత్రి మండలి లాంటి సంస్థలు రాజును కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర వహించేవి. రాజ కుటుంబానికి చెందిన వారిని మంత్రులుగా, రాజ్యంలోని ప్రాంతాలకు రాజ ప్రతినిధులుగా, సైనిక ఉన్నతాధికారులుగా నియమించేవారు.
ప్రభుత్వ శాఖలు:
ప్రభుత్వ కార్యక్రమాలు శాఖల ద్వారా జరిగేవి. ఆఠావణ, కందాచార, భాండార, ధర్మాసన, సుంకవ్యవహారాధి శాఖలుండేవి. విజయనగర కాలంలో రెవెన్యూ శాఖ(ఆఠావణ), సైనికశాఖ (కందాచార), కోశాగార శాఖ (భాండార), న్యాయశాఖ (ధర్మాసనం) సుంక వ్యవహారశాఖ అనే విభాగాలు పనిచేసేవి. ప్రతి శాఖ కార్యాలయం పేరు రాయసము, ప్రతిశాఖ అధ్యక్షుడి పేరు సంప్రతులు (మంత్రులు), భాండారంలో రత్న, స్వర్ణ భాండార అనే విభాగాలుండేవి. సంప్రతులు సీమలు, స్థలాల పొలిమేరల గురించి, సామంతుల శిస్తుల గురించి చిట్టాలను తయారు చేసేవారు.
పాలనా విభజన: విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాలుగా(రాష్ట్రాలు) విభజించారు. తిరిగి ఒక్కో రాజ్యాన్ని నాడులు(జిల్లాలు)గా, (సీమలు)గా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. చిట్టచివరి యూనిట్‌ను గ్రామాలుగా విభజించారు.
రాజ్యాలను సాధారణంగా ఆ రాజ్య దుర్గం పేరుతో పిలిచేవారు. రాజ్యపాలకులను రాజే నియమిస్తాడు. రాజ్య పాలకుడిని దుర్గాధిపతి, దండనాయకుడు అని వ్యవహరించేవారు. నాడుల (సీమలు) పరిపాలనా వ్యవహారాలను పారుపత్యదారులు చూసేవారు. కొన్ని గ్రామాల సముదాయమే నాడులు, నాడులను (జిల్లాలు) తిరిగి స్థలాలుగా విభజించేవారు. స్థలాల వ్యవహారాలను గౌడ, కరణం పర్యవేక్షించేవారు. వీరి కార్యాలయాన్ని చావడి అంటారు. గ్రామ వ్యవహారాలను ఆయగాండ్రు, గ్రామభటులు నిర్వహించేవారు. ఆయగాండ్రల్లో రెడ్డి, కరణం, నీరు కావలి, తలారి, చాకలి, మంగలి వంటి వారు ఉండేవారు. గ్రామాల్లోని రైతులు వీరికి తమ పంటలో కొంతభాగాన్ని ‘మేర’గా ఇచ్చేవారు. ఆనాడు ఐదు రకాల గ్రామాలుండేవి. సైనికుల నిర్వహణ కోసం అమరు నాయకులకు ఇచ్చే అమర గ్రామాలు, బ్రాహ్మణులకు ఇచ్చే గ్రామాలను బ్రహ్మదేయ, నిత్య పూజా కార్యక్రమాలు, ఉత్సవాల ఖర్చుల నిమిత్తం ఇచ్చే గ్రామాలను దేవాదాయ, రాజోద్యోగులు, పండితులు, కవులకు, శాస్త్రవేత్తలకు దానమిచ్చిన గ్రామాలను ఉంబలి గ్రామాలు అని పిలిచేవారు. రాజ్య గ్రామాలను భండారవాడ గ్రామాలని పిలిచేవారు. గ్రామాల్లోని కొంత భూమిని బ్రహ్మదేవ, దేవాదాయ, మఠాపుర అనే బ్రాహ్మణ సంస్థలకు ఇచ్చేవారు. వీటిపై పన్నులు ఉండవు. దైవారాధన, దైవకార్యాల నిర్వహణ కోసం మాన్యాలు(మిరాశీ భూములు) ఇచ్చేవారు. వీటిపై సుంకాలుండవు. భూమిపై హక్కు ఎవరికీ లేదు. ఆనాటి గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవని తెలుస్తోంది. గ్రామ సంరక్షకుడిని తలారి అని పిలిచేవారు.
అమరు నాయంకర వ్యవస్థ: విజయనగర సామ్రాజ్యంలో సాధారణ పాలనా వ్యవస్థతోపాటు భూస్వామ్య వ్యవస్థ, అమరునాయంకర వ్యవస్థ అమల్లో ఉండేవి. అమరునాయంకర వ్యవస్థకు మూలాధారం కాకతీయుల కాలం నాటి నాయంకర వ్యవస్థ. సైనిక వ్యవస్థను రూపొందించడానికి నియమించిన సైనికోద్యోగే నాయక్ లేదా అమరు నాయకుడు. తనకు సైనిక సేవలు అందించే సైనికోద్యోగికి కొంత భూమిని, స్వతంత్ర ప్రతిపత్తి కూడిన ప్రభుత్వాధికారాలను అప్పగించడాన్నే అమరు నాయంకర వ్యవస్థ అని అంటారు. ఇది పాశ్చాత్య ఫ్యూడల్ విధానం వంటిదే. అమరు నాయంకర వ్యవస్థ ద్వారా ఏర్పడిన సైనిక రాజ్య విభాగాలను పాలించే సామంత పాలకులు అమరునాయకులు. ఇది ఒక రకమైన జాగీర్దారీ విధానం లాంటిదని ప్రముఖ చరిత్రకారుడు న్యూనిజ్ పేర్కొన్నాడు. అమరు నాయకులు యుద్ధ సమయాల్లో రాజుకు కావాల్సిన సైనిక ఏర్పాట్లు చేసేవారు. రాజుతోపాటు యుద్ధభూమిలో ముందుండి సైన్యాలకు నాయకత్వం వహించేవారు. క్రీ.శ. 16వ శతాబ్దంలో దేశంలో సుమారు 200 మంది అమరు నాయకులు ఉన్నట్లు న్యూనిజ్ వెల్లడించాడు.
అమరునాయక సైన్యంతోపాటు రాజులు స్వయంగా జీతమిచ్చి, పోషించే సిద్ధ సైన్యాన్ని కైజీతం అని పిలిచేవారు. వీరి నియామకం, పోషణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను రాజులే స్వయంగా చేసేవారు. ఈ సైన్యంలో యుద్ధ నైపుణ్యం కలిగిన కబ్బలి, తుళువ, మోరసు జాతివారిని చేర్చుకునేవారు. శ్రీకృష్ణదేవరాయలకు కైజీత సైన్యం 50 వేల మంది ఉండేవారు. గ్రామాల్లో తలారులు, రాజ్య సరిహద్దు ప్రాంతాల్లో పాలెగాండ్రు శాంతిభద్రతల బాధ్యతలను చేపట్టేవారని అబ్దుల్ రజాక్, న్యూనిజ్‌లు ప్రస్తావించారు.
విజయనగర రాజుల కాలంలో ఆంధ్ర, కన్నడ, తమిళ ప్రాంతాల్లో సైనిక పాలనలో తేడాలున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రాలను రాజ్యాలుగా వ్యవహరించేవారు. విజయనగర రాజ్యంలో పెనుగొండ, గుత్తి, శ్రీశైలం, కందనవోలు, ఉదయగిరి, చంద్రగిరి, కొండవీడు ముఖ్య కేంద్రాలు. వీటికి దుర్గాధిపతి నాయకుడు. కన్నడ ప్రాంతంలో విషయం, సీమలు, స్థలం అనే రాజ్య విభాగాలుండేవి. తమిళ మండలంలోని చోళయుగం నాటి నాడు, పర్రు, కొట్టం మొదలైన విభాగాలను విజయనగర రాజులు యథాతథంగా అనుసరించారు. సైనిక అవసరాల నిమిత్తం దుర్గాధిపతులు, దండనాయకులు దుర్గదన్నాయిక నివర్తన అనే పన్నులను వసూలు చేసేవారు.
సామాజిక పరిస్థితులు:
మధ్యయుగ కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు విజయనగర చరిత్రలో కనిపిస్తాయి. సమాజం కుల ప్రాతిపదికన విడిపోవడం, వర్ణ వ్యవస్థలోని లోపాలను ఖండిస్తూ భక్తి ఉద్యమం తలెత్తడం ఆనాటి సమాజంలో దర్శనమిస్తాయి. సంఘంలో దేవదాసీ విధానం, వేశ్యల వ్యవస్థ, సతీసహగమనం, ఉత్సవ సమయాల్లో ఆత్మార్పణలు, కన్యాశుల్కాలు వంటి ఎన్నో దురాచారాలను అప్పటి విదేశీ యాత్రికులు డొమింగో పయస్, న్యూనిజ్‌లు రచనల్లో ప్రస్తావించారు. న్యూనిజ్ రాతల ప్రకారం.. వేశ్యా వృత్తి ఒక ప్రబలమైన సామాజిక వ్యవస్థగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది.
సమాజంలో బ్రహ్మ వివాహ పద్ధతి ఒక సంప్రదాయంగా కొనసాగింది. వీరనరసింహరాయలు వివాహ పన్నులను, శ్రీకృష్ణదేవరాయలు కన్యాశుల్కాన్ని రద్దు చేశారు. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర, విదేశీ యాత్రికుల కథనాల ప్రకారం.. సమాజంలో వర్ణవ్యవస్థ, దానికి అనుగుణంగా అనేక కులాలు, ఉప కులాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణాధిక్యత ఉండేది. యజ్ఞాలు, యాగాలు, దానాలు, క్రతువులు విరివిగా నిర్వహించేవారు. కవి, పండిత సభలు జరిగేవి. బ్రాహ్మణులతోపాటు సామాన్యులు కూడా రాజుల నుంచి కానుకలు, డబ్బు పొందేవారు. పాలకులు వారికి మడులు, మాన్యాలిచ్చి పోషించేవారు.
శ్రీకృష్ణదేవరాయలు బ్రాహ్మణులను అమితంగా ఆదరించి, గౌరవించాడని పయస్ రచనల ద్వారా తెలుస్తోంది. ఈ యుగంలో బ్రాహ్మణులు.. సేనాధిపతులు, కరణాలు, రాయసగాళ్లు, మంత్రి, దుర్గాధిపతి మొదలైన పదవులను నిర్వహించేవారు. బ్రాహ్మణుల్లో ఆరు శాఖలున్నాయి. పూజారులు, భూస్వాములు, మఠాధిపతులు, ప్రభుత్వోద్యోగులు, వర్తకులు, భోక్తలుగా ఉన్నారు.
క్షత్రియుల్లో సూర్యవంశ, చంద్రవంశ అనే రెండు శాఖలున్నాయి. చోళులు, ఒరిస్సా గజపతులు సూర్యవంశీయులని, విజయనగర రాజులు చంద్రవంశ క్షత్రియులని అప్పటి శాసనాలను బట్టి తెలుస్తోంది.
విజయనగర రాజ్యంలో వైశ్యులు వ్యవసాయం, పశుపోషణ చేసేవారని ప్రబంధాలు పేర్కొన్నాయి. వెలమలు, కమ్మవారు, బలిజలు, కురుమలు, గొల్లలు తదితర ముఖ్య వృత్తుల వారిని శూద్ర కులాలుగా గుర్తించారు. సాంఘిక గౌరవాల కోసం పోరాడిన పంచాణం వారు సంఘంలో ముఖ్యులుగా చలామణి అయ్యారు. శూద్రులను తక్కువ కులంవారిగా భావించేవారు. శ్రమశక్తి అంతా వీరిదే. గ్రామాల్లో కులప్రాతిపదికన ప్రజలు వేర్వేరుగా నివసించేవారు. మాలలు, మాదిగలను గ్రామాలకు దూరంగా ఉంచేవారు. పాదరక్షలు, చాంతాళ్లు, తోలు సంచులను తయారు చేయడం వీరి వృత్తి. విప్రులు వివిధ వేషాలతో ప్రజలకు వినోదం పంచేవారు.
ప్రజల్లో మత సంబంధమైన మూఢ విశ్వాసాలు, ఆచారాలు ఎక్కువగా ఉండేది. బహు దేవతారాధన అమల్లో ఉండేది. గ్రామ దేవతల పండగలు, నవరాత్రుల ఉత్సవాల్లో జంతు బలులు జరిగేవి. ప్రజలు సిరిమాను ఎక్కి ఆడడం, నిప్పులపై నడవడం, అగ్నిగుండంలో ప్రవేశించడం వంటి వికృతమైన ఆచారాలుండేవి.
ప్రభువులు, ధనిక వర్గాల్లో శృంగార ప్రియత్వం, భోగలాలసత్వం, బహుభార్యత్వం ఉండేవి. వివాహ ఆడంబరాలు, వేశ్యల పట్ల వ్యామోహం ప్రదర్శించేవారు. ఉంపుడుగత్తెలను తమ హోదాకు చిహ్నంగా భావించేవారు. సతీసహగమనం, భర్త మృతదేహంతోపాటు భార్యను పూడ్చిపెట్టే ఆచారం ఉన్నట్లు న్యూనిజ్ రాశాడు. సమాజంలో జూదాలు, మద్యపానం, ధూమపానం ఎక్కువగా ఉండేవి. వేషధారణలో తురుష్క- పాశ్చాత్య సంప్రదాయాలు ప్రవేశించాయి.
విజయనగర రాజ్యంలో రాజులు విలాసవంతమైన జీవితం గడిపేవారు. రాజభవనానికి ఆనుకొని 72 కార్యాలయాలు(నియోగాలు) ఉండేవి. యుక్తవయస్సులో ఉన్న స్త్రీలను రాజుకు రక్షక భటులుగా నియమించేవారు. యవ్వనంలో ఉన్న అందమైన పారశీక కన్యలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేవారు. సమాజంలో భోగం స్త్రీలకు గౌరవం దక్కేది. వారు సంగీతం, నాట్యంలో నిష్ణాతులని పయస్ తన రచనల్లో పేర్కొన్నాడు.
వివాహాలు ఎనిమిది విధాలుగా జరిగేవి. కట్నాలు, కానుకలు ఉండేవి. పురాణాలు ఇతిహాసాలు, యక్షగానాలు సామాన్య ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. శరన్నవరాత్రులు పది రోజులపాటు వైభవంగా జరిగేవి. తొలి విజయనగర రాజులు శైవభక్తులు. తర్వాత వచ్చిన రాజులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. సంస్కృత నాటకాలు, తెలుగు, కన్నడ యక్షగానాలు, బొమ్మలాటలు, కోడి, గొర్రెపోతుల పందేలు ఆనాటి ముఖ్య వినోదాలు. విజయనగర రాజుల కులదైవం విరూపాక్ష స్వామి. వీరి రాజ లాంఛనం వరాహం.
మత పరిస్థితులు:
విజయనగర రాజులు ముస్లింల రాజ్య విస్తరణను అరికట్టారు. వేదమార్గ ప్రతిష్టానాచార్యులు అనే బిరుదును ధరించారు. రాజ్యంలో హిందువులతో పాటు జైనులు, ముస్లింలు, క్రైస్తవులు ఉండేవారు. విజయనగర రాజులు అన్ని మతాల వారిని సమాదరించారు. శ్రీరంగంలో వైష్ణవులు.. జైనులను హింసకు గురిచేస్తుండగా బుక్కరాయలు వారి మధ్య సఖ్యత కుదిర్చాడు. రాజధానిలో విరూపాక్షాలయం పక్కనే జైనుల ఆలయాలున్నాయి. దేవరాయలు జైనులు, ముస్లింలకు ప్రార్థనా సౌకర్యాలు కల్పించాడు. ఆళియరామరాయలు రాజధానిలోని తురకవాడలో గోవధను అనుమతించాడు. విజయనగర సంగమ వంశీయుల కులగురువు క్రియాశక్తి ఆచార్యులు. ఆనాడు శైవంతో పాటు స్మార్త గురుపీఠమైన శృంగేరి కూడా ప్రాబల్యం పొందింది. హరిహర సోదరులు శృంగేరిని దర్శించి, మఠాధిపతిైయెున విద్యాతీర్థులకు దాన ధర్మాలు చేశారు.
విజయనగర పాలకుల హయాంలో వైష్ణవ మతం రాజాదరణ పొందింది. వైష్ణవంలో ద్వైతం, విశిష్టాద్వైతం అనే రెండు శాఖలుండేవి. ద్వైత మత స్థాపకుడు మధ్వాచార్యులు. ఇతడి తర్వాత వచ్చిన గురువు నరహరి తీర్థులు. శ్రీకూర్మం కేంద్రంగా ఆంధ్ర కళింగ ప్రాంతంలో మధ్వమతం ప్రచారం పొందింది. వ్యాసతీర్థులు ద్వైత మతాన్ని వ్యాపింపచేశారు. ఇతడు కృష్ణదేవరాయలకు గురువు. ఆనాటి వైష్ణవ కుటుంబాల్లో తాళ్లపాక తాతాచార్యులు ప్రసద్ధిగాంచారు. వీరు తుళువ, ఆరవీటి వంశాల వారికి కులగురువులు. రెండో వెంకటపతి ఆస్థానంలో తిరుమల శ్రీనివాసాచార్య, కందాళ అప్పలాచార్య, తాళ్లపాక తిరుమాలాచార్య అనే గొప్ప విద్వాంసులుండేవారు. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, శ్రీకాళహస్తి ఆలయాలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. ఈ కాలంలో మఠాలు ఆలయాలకు అనుబంధంగా ఉండేవి. కడప జిల్లాలో పుష్పగిరి, శృంగేరి స్మార్త మఠశాఖ వెలసింది. శ్రీశైలంలో వీరశైవ మఠాలుండేవి. భిన్నశాఖలైన శైవ- వైష్ణవ, అద్వైత- విశిష్టాద్వైతాల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరిగేవి. ఆయా మతాభిమానులు పరస్పరం దూషించుకునేవారు.
దుస్తులు-ఆభరణాలు:
ప్రజలు సిల్కు చొక్కాలు, పావడాలు, శిరస్సుపై టోపీలు, ధోవతి, ఉత్తరీయాలను ధరించేవారు. దండలు, హారాలు, కడియాలను కూడా ధరించేవారు. ముక్కెర, కమ్మలు స్త్రీలకు ప్రత్యేకం. శిరోజాలపై ఆభరణాలు ధరించేవారు. కవులకు, వీరులకు గండపెండేరాలు తొడిగేవారు. స్త్రీలు గంధం, కర్పూరం, కస్తూరి, పునుగు తైలం, కుంకుమను పూసుకునేవారు.
సాహిత్యం- కళలు:
ఈ యుగంలో తెలుగు, కన్నడ, తమిళ, సంస్కృత భాషల్లో సాహిత్యం వికసించింది. కుమార కంపన భార్య గంగాదేవి సంస్కృత భాషలో మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది. తిరుమలాంబిక వరదాంబికా పరిణయం, రామభద్రాంబిక రఘునాథాభ్యుదయం, రాజనాథ డిండిముడు సాళువాభ్యుదయం అనే గ్రంథాలను రచించారు. రెండో దేవరాయలు బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానం రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్తమాల్యదను రచించాడు. విద్యారణ్యుడు సంగీతసారం, బండారు లక్ష్మీనారాయణుడు సంగీత సూర్యోదయం, నారాయణ తీర్థులు కృష్ణలీలా తరంగిణిని రచించారు. వేదాంత దేశీకుడు యాదవాభ్యుదయం, రామాభ్యుదయాలను రచించాడు.
సాళువ నరసింహుడి కాలంలో తెలుగు భాషలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని రచించాడు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమ, ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి పొందాడు. అతడి భువన విజయం సభలో అష్టదిగ్గజాలనే కవులు ఉండేవారు. వారి రచనలు విశేష ప్రఖ్యాతిగాంచాయి. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయగారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, భట్టుమూర్తి అష్టదిగ్గజాలుగా గుర్తింపు పొందారు. కృష్ణదేవరాయల ఆస్థాన కవి అల్లసాని పెద్దన. ఇతడు మనుచరిత్రను రచించాడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, తెనాలి రామకృష్ణుడు తెలుగు భాషలో పాండురంగ మహాత్యం, ఘటికాచల మహాత్యాన్ని రచించాడు. ఈ యుగంలో పురాణాలను ప్రబంధ శైలిలో రచించడం విశేషం. నంది తిమ్మన పారిజాతాపహరణం, మాధయగారి మల్లన రాజశేఖర చరిత్ర, పింగళి సూరన కళాపూర్ణోదయం, రామరాజ భూషణుడు వసు చరిత్రను రాశారు. వాణి నారాణి అని పేర్కొన్న పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార శాకుంతలం రచించాడు. ఈ యుగంలో తాళ్లపాక అన్నమాచార్యుడు 32 వేల కీర్తనలను రచించాడు. ఇతడు పదకవితా పితామహుడు, పద సంకీర్తనాచార్యుడు, వాగ్గేయకారుడిగా పేరు పొందాడు. అన్నమాచార్యుడు సాళువ నరసింహరాయలకు సమకాలికుడు.
ఆలయ నిర్మాణాలు:
ఈ కాలంలో దక్షిణాపథంలో ఆలయాల నిర్మాణం విరివిగా జరిగింది. సామ్రాజ్య విస్తరణకు, ఐశ్వర్యానికి అప్పటి ఆలయాలు నిదర్శనాలు. విజయనగర రాజులు తొలి దశలో ఆలయ నిర్మాణంలో చాళుక్య శైలిని అనుసరించారు. క్రమంగా చోళ సంప్రదాయాలను పాటించారు. సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తయిన గోపురాలు, రంగ మండపాలు, కల్యాణ మండపాలను నిర్మించారు. ఆనాటి మండపాలు సహస్ర స్తంభ మండపాలుగా ప్రసిద్ధి పొందాయి. హంపీలో విరూపాక్ష, విఠల, హజారా రామాలయాలు ప్రసిద్ధి గాంచాయి. హజారా రామాలయంలో గోడలపై రామాయణ గాథలను చెక్కించారు. ఆంధ్రదేశంలో పుష్పగిరి, తాడిపత్రి, లేపాక్షి, చంద్రగిరి, పెనుగొండ ప్రాంతాల్లో గొప్ప ఆలయాలను నిర్మించారు. విజయనగర రాజులు తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు గోపురాలను నిర్మించారు. అహోబిలం, మార్కాపురం, సింహాచలం వంటి ఆలయాల్లో మండపాలను నిర్మించారు. తాడిపత్రిలోని రామలింగేశ్వర ఆలయ గోపురాలు సుందరంగా కనిపిస్తాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రాలయం వర్ణచిత్రాలకు ప్రసిద్ధి. లేపాక్షి బసవన్న విగ్రహాన్ని గొప్పగా తీర్చిదిద్దారు. సుందరమైన శిల్పసంపద విషయంలో బేలూరు, హలిబేడు ఆలయాలకు పోటీగా విజయనగర ఆలయాల్లో నిలువగలిగింది ఒక్క తాడిపత్రి ఆలయమేనని ఫెర్గూసన్ అభిప్రాయపడ్డాడు. మధ్యయుగ చరిత్రలో ఆర్థిక, సాంఘిక, మత, సాహిత్య రంగాలు, శిల్ప కళల్లో విజయనగరం పేరుప్రఖ్యాతలను సంపాదించింది.
* విజయనగర తొలి రాజుల కులదైవం విరూపాక్షుడు. వీరు శైవమతాభిమానులు.
* విజయనగర పాలకుల రాజలాంఛనం వరాహం.
* శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసతీర్థుడు. ఇతడు వైష్ణవ మతాభిమాని.
* విజయనగరం రాజుల కాలంలో ఆర్థిక సంవత్సరం శ్రీరామనవమితో ప్రారంభమయ్యేది.
* కుమార కంపన భార్య గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది.
* తెలుగులో పంచతంత్రాన్ని రచించిన కవి దూబగుంట నారాయణ కవి.
* శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యద గ్రంథాన్ని శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు.
* కృష్ణలీలా తరంగిణి రచయిత నారాయణ తీర్థులు.
* ఆరవీటి రాజుల తొలి రాజధాని పెనుగొండ.
* శ్రీకృష్ణదేవరాయలు.. విఠలాలయం, కృష్ణస్వామి ఆలయాలను నిర్మించాడు.
* కృష్ణదేవరాయలు తన తల్లి నాగాంబ పేరున నిర్మించిన నూతన నగరం నాగలాపురం.
* ఏకశిలా రథం ఉన్న ఆలయం విఠలాలయం
* విజయనగర కాలంనాటి చిత్రలేఖనాలు లేపాక్షి వీరభద్రాలయంలో కన్పిస్తాయి.
* విజయనగరంలో ముస్లింలకు మసీదును నిర్మించి ఇచ్చిన రాజు రెండో దేవరాయలు.
* చింత వెంకటరమణ ఆలయం తాడిపత్రిలో ఉంది.
* లేపాక్షి వీరభద్రాలయాన్ని పెనుగొండ కోశాధికారి విరూపణ్ణ నిర్మించాడు.
Advertisements
1 comment:
how to download this document.....please provide the way to download
Post a Comment