Andhra
History in Telugu Medium, SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH, A.P
History Class Notes PDF, Xerox Material, Andhra Pradesh History for APPSC Group
2 Exam, Group 1 exam, Paper 2 , Section 1, chapter wise material download,
Andhra Pradesh Public Service Commission Material for Groups
Andhra
History Other Important Notes
|
|
9) Kakatiyas
12) Bahamani Kingdom
|
కాకతీయులు- రాజకీయ చరిత్ర
మొదటి బేతరాజు(క్రీ.శ.1000-52): మొదటి బేతరాజు, మొదటి, రెండో ప్రోలరాజులు, రెండో బేతరాజు, దుర్గరాజులు... పశ్చిమ ప్రాంత కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. రాష్ర్టకూట సేనాని, కాకర్త్య గుండయ మానుకోట ప్రాంతంలో (కొరవి) అధిపతిగా ఉండేవాడు. గుండయ కుమారుడే మొదటి బేతరాజు. ఇతడిని గరుడాంక బేతరాజని శాసనాలు పేర్కొంటున్నాయి. తండ్రి మరణించే నాటికి మొదటి బేతరాజు పసివాడు కావడంతో రాజ్యంలో కల్లోలం చెలరేగింది. ఈ విపత్తు నుంచి కాకతీయ కుటుంబానికి చెందిన కామసాని, ఆమె భర్త ఎర్ర భూపతి రాజ్యాన్ని కాపాడారు. మొదటి బేతరాజు విజయాలను విక్రమాంక దేవ చరిత్ర, ఖాజీపేట శాసనాలు వివరిస్తున్నాయి. ఖాజీపేట శాసనం ప్రకారం మొదటి బేతరాజుకు కాకతీపురాధినాథఅనే బిరుదు ఉంది. మొదటి బేతరాజు కాలం (క్రీ.శ. 1000-1052). సంప్రదాయ కథనం ప్రకారం అనుమకొండను.. అనుమడు, కొండడు అనే ఇద్దరు సోదరులు నిర్మించినట్లు తెలుస్తోంది.
ఏకామ్రనాథుని ప్రతాపరుద్రుడి చరిత్రం, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం ఎరుక దేవరాజు అనే వేటగాడు అనుమకొండను నిర్మించినట్లు స్పష్టమవుతోంది.
మొదటి ప్రోలరాజు: మొదటి బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఇతడు క్రీ.శ. 1052- 1075 వరకు పాలించాడు. కళ్యాణీ చాళుక్య సోమేశ్వరుడి దండయాత్రల్లో ప్రోలరాజు ప్రముఖ పాత్ర వహించి, అతడి మెప్పు పొందాడు. అనంతరం అనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో దక్కించుకుని సామంత హోదాను పొందాడు. ప్రోలరాజు శైవభక్తుడు. ఇతడు చక్రకూట(బస్తర్) పాలకుడైన.. నాగవంశీరాజును ఓడించాడు. ఇతడి కాలంలోనే క్రీ.శ. 1053లో శనిగరం శాసనం వేయించినట్లు తెలుస్తోంది.
ఈ శాసనంలో తాను ‘త్రైలోక్యమల్ల (సోమేశ్వరుడి) వల్లభ ప్రసాదాసాది మహిమాస్పదుడి’నని చెప్పుకున్నాడు. దీనిని బట్టి మొదటి ప్రోలరాజు అధీనంలో అనుమకొండ, సబ్బినాడు మండలాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు కళ్యాణీ చాళుక్య సోమేశ్వరుడితో కంచి యుద్ధంలో పాల్గొన్నాడు. మొదటి ప్రోలరాజుకు అరిగజకేసరి అనే బిరుదువుంది.
రెండో బేతరాజు: మొదటి ప్రోలరాజు కుమారుడు రెండో బేతరాజు. ఇతడు క్రీ.శ. 1075-1090 వరకు పాలించాడు. బేతరాజు పశ్చిమ చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి సామంతుడు. విక్రమాదిత్యుడి నుంచి సబ్బి మండలాన్ని (కరీంనగర్) బహుమానంగా పొందాడు. ఇతడి కాలం నుంచే అనుమకొండ కాకతీయులకు రాజధాని అయింది. రెండో బేతరాజుకు త్రిభువనమల్ల, విక్రమచక్రి, చలమర్తి గండడు, మహా మండలేశ్వరుడు అనే బిరుదులున్నాయి. ఇతడి గురువు కాలాముఖి శైవ శాఖకు చెందిన రామేశ్వర పండితుడు.
రెండో ప్రోలరాజు: రెండో బేతరాజు పుత్రుల్లో మొదటివాడు దుర్గరాజు, రెండోవాడు తొలి కాకతీయ రాజుల్లో ప్రసిద్ధిగాంచిన రెండో ప్రోలరాజు. రాజ్యం కోసం దుర్గరాజు, రెండో ప్రోలరాజుల మధ్య పోరు సాగింది. తుదకు రెండో ప్రోలరాజు తన అన్న దుర్గరాజును తొలగించి, మొదటి కాకతీయ స్వతంత్ర రాజుగా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. రెండో ప్రోలరాజు మిక్కిలి ప్రతిభావంతుడు. ఇతడి కాలంలోనే కాకతీయ రాజ్యానికి తగిన రూపురేఖలు వచ్చాయి. శత్రువులందరినీ తదుముట్టించి కాకతీయ రాజ్యాన్ని ఇతడు పటిష్టం చేశాడు. అనుభవజ్ఞుడైన వైజదండనాధుడు ఇతడి వద్ద మంత్రిగా పనిచేశాడు. రెండో ప్రోలరాజు రాజ్యకాలం క్రీ.శ. 1117-1158. రెండో ప్రోలరాజు సాధించిన విజయాలను అతడి కుమారుడైన కాకతీ రుద్రదేవుడు క్రీ.శ. 1163లో వేసిన అనుమకొండ శాసనం విశదీకరిస్తోంది.
రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు
(క్రీ.శ. 1158-1195): రెండో ప్రోలరాజుకు పుత్రులు చాలామంది ఉన్నప్పటికీ, వారిలో రుద్రదేవుడు, మహాదేవరాజులు మాత్రమే విశేష ఖ్యాతి గడించారు. స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు రుద్రదేవుడు. ఇతడిని మొదటి ప్రతాపరుద్రుడిగా కూడా పిలుస్తారు. రుద్రదేవుడి ప్రతిభాపాటవాలు, రాజ్యనిర్మాణ దక్షత, యుద్ధ విజయాలను క్రీ.శ. 1163లో ఇతడు వేయించిన అనుమకొండ శాసనం వివరిస్తుంది. అనుమకొండ శాసన ప్రశస్తిని అచితేంద్రుడు సంస్కృతంలో రచించాడు. రుద్రదేవుడి విజయాలకు కారకుడు అతడి మంత్రి గంగాధరుడు. ఇతడు విశేష సేవలందించాడు. గంగాధరుడి ప్రతిభను గుర్తించిన రుద్రదేవుడు.. నగునూరు, సబ్బినాటి ప్రాంతాలకు అధిపతిగా నియమించాడు. రుద్రదేవుడు తన రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన శ్రీశైలం, పశ్చిమాన కళ్యాణీ, ఉత్తరాన గోదావరి నదీతీరం వరకు విస్తరించాడు. కాకతీ రుద్రదేవుడు క్రీ.శ.1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సైన్యాన్ని పంపి, సహాయ పడ్డాడు. ఇతడి సామ్రాజ్య విస్తరణలో సేనానులైన చెరకు, మల్యాల, పిల్లలమర్రి, రేచర్ల వంశీయుల అండదండలు రుద్రదేవుడికి లభించాయి.
రుద్రుడి మంత్రిగణంలో వెల్లంకి గంగాధరుడు ప్రసిద్ధుడు. ఇందులూరు బ్రాహ్మణ వంశానికి చెందిన పెద్ద మల్లన, చిన్నమల్లన అనే అధికారుల వివరాలను శివయోగసారం గ్రంథం తెలుపుతోంది. రుద్రదేవుడు అనుమకొండ ప్రసన్న కేశవాలయం వద్ద గంగచియ చెరువును తవ్వించాడు. అనుమకొండలో వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలానగరాలకు పునాది వేశాడు. రుద్రదేవుడు అనుమకొండలో వేయి స్తంభాల గుడిని క్రీ.శ.1163లో ని ర్మించాడు. ఇది త్రికూట ఆలయం. నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవ, సూర్యదేవుడి ఆలయాలు నక్ష త్ర ఆకారంలో(త్రికూటం) రుద్రదేవుడు నిర్మించాడు.రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసార అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి వినయ భూషణుడు అనే బిరుదు ఉంది. క్రీ.శ. 1196లో దేవగిరి యాదవరాజైన జైతుగి చేతిలో ఓడి రుద్రదేవుడు మరణించాడు. అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన రుద్రదేవుడి సోదరుడు మహాదేవుడు యాదవులపై దండెత్తి, యు ద్ధంలో మరణించాడు. యాదవ రాజైన జైతుగి లేదా జైత్రపాలుడు, యువరాజైన గణపతి దేవుడిని బందీగా పట్టుకున్నాడు. అయితే, గణపతి దేవుడి గుణగణాలను అతడు మెచ్చుకొని కాకతీయ సింహాసనంపై తిరిగి కూర్చోబెట్టాడు.
కాకతీయుల కాలంనాటి పరిస్థితులు
సామాజిక పరిస్థితులు: కాకతీయుల కాలంనాటి సమాజం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం, అమీర్ ఖుస్రో రాసిన మిఫ్తా-ఉల్-పుతా, మార్కోపోలో రచనలు.
ఆనాటి సమాజంలో కులవ్యవస్థ బలపడింది. చతుర్థ కులాలైన కమ్మ, రెడ్డి, వెలమ, బలిజ పాలక వర్గాలుగా స్థిరపడ్డాయి. కాకతీయుల పాలనా వ్యవస్థ వివిధ కులాల మధ్య సమన్వయ వ్యవస్థగా రూపుదిద్దుకుంది. కుల సంఘాలు సాంఘిక జీవితంలో ప్రధాన పాత్ర వహించాయి. కుల సంఘాలను సమయాలు అని పిలిచేవారు. బ్రాహ్మణ కుల సంఘాలను మహాజనులని, వైశ్యుల కుల సంఘాలను నకరములనే పేర్లతో పిలిచారు. శైవ, వైష్ణవులు అర్చక సంఘాలుగా ఏర్పడ్డారు. సానిమున్నూరు, తెలికిదేవురు, పంచాణంవారు.. అనే కుల సంఘాలుండేవి. సమాజంలో గిరిజన తెగల వారు (లెంకలు) పాలక వర్గాలకు సేవలు అందించడానికి ఏర్పడ్డారు.
సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది. వీరు విద్య, మత సంబంధిత బాధ్యతలను నిర్వహించేవారు. కొందరు రాజాస్థానంలో అమాత్యులు, దండనాయకులు, రాష్ర్టపాలకులుగా బాధ్యతలు నిర్వహించేవారు. రు ద్రమదేవి పరిపాలనా కాలంలో ఇందులూరి అన్నయ మంత్రి మహామంత్రిగా వ్యవహరించా డు. రుద్రమదేవి తన కుమార్తె రుయ్యమదేవిని ఈ బ్రాహ్మణ మంత్రికిచ్చి వివాహం చేసింది. ఈ కాలంలో క్షత్రియుల ప్రాబల్యం తగ్గింది. ఆంధ్రదేశంలో వైశ్యులను కోమటిశెట్టి అని పిలిచేవారు. వీరు వ్యవసాయం, పశుపోషణ, వర్తక-వాణిజ్యాలను చేపట్టారు.
సమాజంలో అధిక సంఖ్యాకులు శూద్రులు. వీరు వ్యవసాయం, వృత్తిపనులు చేసేవారు. వీరిలో రెడ్డి, వెలమ, కమ్మ, తెలగ, బోయ విభాగాలు ముఖ్యమైనవి. సమాజంలో కులద్వేషాలు ఎక్కువ. గణపతి దేవుడు వివిధ కులాల వారితో సామరస్యం పాటించాడు. ప్రతాపరుద్రుడు పద్మనాయక వెలమలకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా రెడ్లు - వెలమల మధ్య విభేదాలు వచ్చాయి. కాకతీయ సామ్రాజ్య పతనానికి ఇది ఒక కారణమైంది. సమాజంలో పంచమ కులస్థులను అంటరాని వారుగా పరిగణించేవారు. ఈ కులస్థులు వ్యవసాయ కూలీలుగా, చర్మకారులుగా పనిచేసేవారు. అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండేది. సమాజంలో మూఢభక్తి ఎక్కువ. సత్రభోజనాలు బ్రాహ్మణులకు ప్రత్యేకం. మార్కాపురం శాసనం ప్రకారం... సత్రాల్లో బ్రాహ్మణులతోపాటు పంచములకు కూడా అన్న, వస్త్రదానాలను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
సంఘంలో స్త్రీ స్థానం దిగజారింది. బాల్య వివాహాలు, వేశ్య వృత్తి, సతీసహగమనాలు, నిర్బంధ ైైవైధవ్యం, వరకట్నాలు.. నాటి సాంఘిక దురాచారాలు. దేవదాసీలకు, వేశ్యలకు సంఘంలో గౌరవం ఉండేది. కులాంతర వివాహాలు జరిగేవి. ఓరుగల్లులో వేలాది వేశ్య గృహాలు ఉండేవని ఏక్రామనాథుడు తన ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్నాడు.
ఉన్నత తరగతులకు చెందిన స్త్రీలు పసుపు, గోరింటాకు, లక్కరంగు (లిప్‌స్టిక్), దండి కడియాలను అలంకరించుకునేవారు. తాయెత్తులను రక్షగా కట్టుకునేవారు. తోలుబొమ్మలాటలు, కోలాటం, గొండ్లి నృత్యాలు, పేరిణీ నృత్యాలు ప్రధాన వినోదాలని పాల్కూరికి సోమనాథుడి బసవపురాణం పేర్కొంటోంది. పగటి వేషాలు, కోడి, పొట్టేళ్ల పందాలు, గంగిరెద్దుల ఆటలు ప్రజల వినోదాలు. వ్యవసాయపరమైన పండగలు సంక్రాంతి, ఏరువాక, గొబ్బిళ్లు గ్రామాల్లో జరుపుకొనేవారు. క్రీ.శ. 1236 నాటి గొడిశాల శాసనంలో ఏరువాక పండగను ఏరువాక గుబ్బలి అని పేర్కొన్నారు.
కాకతీయుల కాలంలో సజ్జలు, జొన్నలు, రాగులు, వరి, కొర్రలు ప్రధాన పంటలు. ఓరుగల్లు కోట బయట అథమజాతుల వారికి మైలసంతలు, కోట లోపల ఉన్నత తరగతుల కోసం మడి సంతలు జరిగేవి. నేరస్థులను కొరడాలతో కొట్టడం, కాలు లేదా చేయి తీసివేయడం, తలనరకడం, కనుగుడ్లు పెరికి వేయడం లాంటి కఠినమైన శిక్షలుండేవని మార్కాపురం శాసనం వెల్లడిస్తోంది.
మత పరిస్థితులు: మతపరంగా తొలి కాకతీయ రాజులు జైన మతాన్ని ఆదరించారు. క్రీ.శ.1051 నాటి శనిగరపు శాసనం ప్రకారం మొదటి బేతరాజు యుద్ధమల్ల జీవాలయానికి దానమిచ్చాడు. హన్మకొండలోని పద్మాక్షి దేవి మొదట జైన దేవతగా పూజలందుకుంది. ఆ తర్వాత శివశక్తి స్వరూపిణిగా మారింది. బోధన్, వేములవాడ, పొట్లచెరువు(పటాన్ చెరువు), హన్మకొండ, కొలనుపాక మొదలైనవి ప్రముఖ జైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆనాడు జైన, శైవ మతాల మధ్య వైషమ్యాలు తారస్థాయికి చేరాయి. కాలాముఖులు, వీరశైవులు జైనమత నిర్మూలనలో ప్రముఖ పాత్ర వహించినట్లు పాల్కూరికి సోమనాథుడు రచించిన గ్రంథాలు వివరిస్తున్నాయి.
మలి కాకతీయుల కాలంలో... ప్రధానంగా గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో పాశుపత, కాపాలిక శాఖలున్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తోంది. గణపతిదేవుడి కాలంలో పాశుపతం వైభవంగా వెలిగింది. కర్ణాటకలో బహుళ ప్రజాదరణ పొందిన వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించాడు. మల్లికార్జున పండితుడి ద్వారా వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించింది. పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించి, వీరశైవ సంప్రదాయాలను ఆంధ్రదేశంలో ప్రచారం చేశాడు. పాశుపతం తర్వాత పండిత త్రయమైన శ్రీపతి, మల్లికార్జునుడు, మంచన పండితులు ఆరాధ్య శైవం పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. లింగం ధరించడం వీరి ప్రత్యేకత. వీరు వర్ణ భేదం, వైదిక కర్మలను నిరసించారు.
సద్భావశంభుడు అనే యోగి శుద్ధ శైవ సంప్రదాయంలో గోళకీ మఠాన్ని స్థాపించాడు. గణపతిదేవుడి కాలంలో ఇది ఆంధ్రదేశంలో విశేష ప్రజాదరణ పొందింది. ద్రాక్షారామం, త్రిపురాంతకం, పుష్పగిరి, శ్రీశైలం మొదలైన చోట్ల గోళకీ మఠ శాఖలు ఏర్పడ్డాయి. గోళకీమఠ ప్రధాన ఆచార్యుడు విశ్వేశ్వర శివదేవయ్య గణపతి దేవుడికి శివదీక్షా గురువు.
కాకతీయుల కాలంలో వైష్ణవ మతం కూడా ఆదరణ పొందింది. కాకతీయుల రాజ లాంఛనం వరాహం. తమిళ దేశం నుంచి రామానుజాచార్యుడి ద్వారా వైష్ణవ మతం ఆంధ్రాలో ప్రవేశించింది. నెల్లూరు, తిరుపతి, మాచర్ల, బాపట్ల, మంగళగిరి, శ్రీకాకుళం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైనవి వైష్ణవ క్షేత్రాలుగా పేరుపొందాయి. అనేక మఠాలు, కుల సంఘాలు ఏర్పడ్డాయి. తత్ఫలితంగా శైవ -వైష్ణవుల మధ్య సంఘర్షణలు తప్పలేదు. ప్రసిద్ధ శైవ క్షేత్రాలను రామానుజాచార్యుడు వైష్ణవ క్షేత్రాలుగా మార్చాడని శ్రీపతిభాష్యం విశదీకరిస్తోంది.
పల్నాటి సీమలో బ్రహ్మనాయుడు వీరవైష్ణవ మతాన్ని స్థాపించాడు. నలగామ రాజు మంత్రి అయిన నాగమ్మ శైవ భక్తురాలు. బ్రహ్మనాయుడు మలిదేవరాజుకు మంత్రి. వీరిద్దరి ప్రాబల్యం కోసం వైషమ్యాలు ఏర్పడ్డాయి. బ్రహ్మనాయుడు సంఘంలో అన్ని కులాల వారిని చేర్చి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి, చాపకూడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. క్రీ.శ.1182లో కారంపూడిలో పల్నాటి యుద్ధం జరిగింది. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం కాకతీయుల కాలంలో అద్వైత, బ్రహ్మ, పంచారాత్రికులు, శూన్యవాదులు, కర్మవాదులు, చార్వాకులు(నాస్తికులు), ప్రకృతివాదులు, ఏకాత్మవాదులు ఉండేవారని తెలుస్తోంది. నాచన సోమనాథుడు తన ఉత్తర హరివంశ గ్రంథాన్ని హరిహరుడికే అంకితమిచ్చాడు. ఈ యుగంలో కాకతమ్మ, ఏకవీర, భైరవ, మైలార దేవులను ప్రజలు పూజించేవారు. అష్టాదశ శక్తుల్లో ఒకటైన అలంపురం జోగులాంబ ప్రసిద్ధి గాంచింది. తెలంగాణలో ఏకవీర(రేణుక) ఓరుగంటి ఎల్లమ్మగా ప్రసిద్ధి. పల్నాడు ప్రాంతంలో వీరపూజలు అధికం. గురజాల గంగమ్మ ప్రసిద్ధ దేవత.
సాహిత్యం: కాకతీయుల రాజభాష సంస్కృతం అయినప్పటికీ ప్రజల భాష తెలుగు ను కూడా ఆదరించారు. శాసనాలను సంస్కృత భాషలో వేయించారు. హన్మకొండ, పాకాల, పాలంపేట, వర్థమానపుర, బూదపుర శాసనాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి.
క్రీ.శ.1163 నాటి హన్మకొండ శాసన ప్రశస్తిని అచితేంద్రుడు, క్రీ.శ.1210 నాటి కుందవర శాసనాన్ని బాలభారతి రచించారు. పాకాల శాసనాన్ని కవి చక్రవర్తి, బూదపుర శాసనాన్ని ఈశ్వరభట్టోపాధ్యాయుడు రచించారు.
విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని సంస్కృతభాషలో రచించాడు. బాలభారతం, నలకీర్తి వంటి ఖండ కావ్యాలను అగస్త్యుడు, ప్రేమాభిరామం అనే వీధినాటకాన్ని రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో రచించారు. కాకతీ రుద్రదేవుడు రాసిన నీతిసారమనే రాజనీతి గ్రంథం సంస్కృతమే! శాకల్యమల్లుభట్టు ఉత్తర రాఘవకావ్యం, నిరోష్ట్య రామాయణం రచించాడు.
తెలుగు సాహిత్యం: కాకతీయుల కాలంనాటి తెలుగు సాహిత్యంలో శివకవుల ప్రాబల్యం ఎక్కువ. తెలుగులో శైవ సాహిత్యానికి మల్లికార్జున పండితుడు శ్రీకారం చుట్టాడు. ఇతడు శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించాడు. పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్యచరిత్ర, బసవ పురాణం అనే ద్విపద కావ్యాలను, అనుభవసారం అనే పద్యకావ్యాన్ని, వృషాధిప శతకం వంటి గ్రంథాలను తెలుగు భాషలో రచించాడు. యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం తెలుగు భాషలో మొదటిది. కేతన దశకుమార చరితం తొలికథా కావ్యం. కేతన ఆంధ్ర భాషాభూషణం అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. వినుకొండ వల్లభ రాయుడు క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని రచించాడు.
బద్దెన సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి, నన్నెచోడుడు కుమార సంభవం, మంచన కేయూర బాహు చరిత్ర, రాజశేఖరుడి విధాహ సాలభంజిక ప్రసిద్ధి పొందాయి. దూబగుంట నారాయణ కవి తెలుగులో పంచతంత్రం రచించాడు. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి మహాభారతంలోని విరాట పర్వం, నిర్వచనోత్తర రామాయణం రచించాడు. శంభుదాసుడైన ఎర్రాప్రెగడ హరివంశం, లక్ష్మీనృసింహ పురాణం, హుళక్కి భాస్కరుడు చంపూ రామాయణాన్ని రచించారు. లీలావతి గణితాన్ని భాస్కరుడు రచించాడు. ఇవన్నీ ఈ యుగంలోనే వచ్చాయి. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రచించాడు. బమ్మెర పోతన మహాభాగవతం, వీరభధ్ర విజయం, భోగినీ దండకం గ్రంథాలను రచించాడు. చరిగొండ ధర్మన చిత్రభారతం, మడికి సింగన సకలనీతి సమ్మతం, మారన మార్కండేయ పురాణం, మల్లియరేచన కవిజనాశ్రయం గ్రంథాలను వెలువరించారు.
వాస్తు శిల్పాలు: కాకతీయులు, వారి సామంతులు వివిధ దేవాలయాలను నిర్మించారు. దేశ రక్షణలో దుర్గాల ప్రాముఖ్యం ఎక్కువ. ఓరుగల్లు, రాయచూరు, రాచకొండ, దేవరకొండ, గోల్కొండ కోటలు ఆనాటి వాస్తుకి నిదర్శనాలుగా నిలిచాయి. కాకతీయ ప్రోలుడి కాలంలో హన్మకొండలో సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం, ఓరుగల్లులో స్వయంభూ కేశవ ఆలయాలను నిర్మించారు. గణపతిదేవుడి కాలంలో నిర్మించిన తోరణ స్తంభాలు మండపాలు, శిల్పాలతో మలచిన స్తంభాలు కాకతీయుల వాస్తుకు నిదర్శనాలు. క్రీ.శ.1163లో రుద్రదేవుడు హన్మకొండలో నిర్మించిన వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం త్రికూట ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయాన్ని రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకు నిర్మించారు. గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, నాగులపాడు, రామప్ప చెరువులను తవ్వించారు. రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో నిర్మించిన పాలంపేట రామప్ప దేవాలయం కాకతీయుల శిల్ప ప్రతిభకు మణిరత్నం. తెలుగుదేశంలో మూడు శతాబ్దాల పాటు కాకతీయుల సాహిత్యం, సంగీతం, నాట్యం గొప్పగా వికసించాయి.
రుద్రమదేవి(క్రీ.శ.1259 -1295)
ఆంధ్రదేశ చరిత్రలో రాజ్యమేలిన ప్రథమ మహిళగా రాణీ రుద్రమదేవి చరిత్రకెక్కింది. ఈమె పరిపాలనా కాలంలోనే వెనీస్ దేశ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి వివాహం గురించి జుత్తిగ శాసనం, త్రిపురాంతక శాసనాల ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవికి క్రీ.శ. 1259లో పట్టాభిషేకం జరిగినట్లు త్రిపురాంతకం శాసనం వెల్లడిస్తోంది. రుద్రమదేవి తన దాయాదుల నుంచి దాడులను ఎదుర్కొంది. రుద్రమకు రేచర్ల ప్రసాదిత్య నాయకుడు, మహా ప్రధాని, కన్నరదేవుడు, కాయస్థ జన్నిగదేవుడు, విరియాల సూరన, రుద్ర నాయకుడు మొదలైనవారు అండగా నిలిచారు. రేచర్ల ప్రసాదిత్యుడికి (పద్మనాయకుడు) కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది. ఈ విషయాన్ని పద్మనాయక వెలమల చరిత్రను తెలిపే వెలుగోటి వారి వంశావళి వెల్లడిస్తోంది. రుద్రమదేవి చేతిలో యాదవరాజైన మహాదేవుడు ఓడిపోయాడు. ఈమె కళింగరాజైన వీరభానుదేవుడిని ఓడించింది. రుద్రమదేవికి, కాయస్థ అంబదేవుడు ప్రధాన శత్రువు. ఇతడితో పోరాడి ఆమె వీరమరణం పొందినట్లు చందుపట్ల శాసనం చెబుతోంది. రుద్రమకు ఫటోధృతి అనే బిరుదు ఉంది. ఈమెకు ముమ్మిడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేదు. పెద్ద కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడిని రుద్రమ దత్తత తీసుకొని కాకతీయ రాజ్యానికి వారసుడిగా ప్రకటించింది. రెండో కుమార్తె రుయ్యమ్మను బ్రాహ్మణుడైన ఇందులూరి అన్నయ మంత్రికిచ్చి వివాహం చేసింది.
ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1295-1323
కాకతీయ మహాదేవరాజు, ముమ్మిడమ్మ దంపతులకు జన్మించిన ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1295లో రాజ్యానికొచ్చాడు. ఇతడిని రెండో ప్రతాపరుద్రుడని పిలుస్తారు. ప్రతాపరుద్రుడు కాయస్థ అంబదేవుడిని ఓడించిన ధీశాలి. ప్రతాప రుద్రుడికి మారురాయడగండ, వీరరుద్రానగండ అనే బిరుదులున్నాయి. ప్రతాపరుద్రుడి చరిత్ర ప్రకారం ఇతడి భార్య విశాలాక్షి. ప్రతాపుడి కాలంలో మాచల్దేవి అనే వారవనిత సాహిత్య గోష్టుల్లో పాల్గొనేదని క్రీడాభిరామం పేర్కొంది. కాకతీయ రాజ్యంపై దాడి చేసిన, మొదటి ఢిల్లీ సుల్తానత్ వంశం ఖిల్జీ వంశం. ఆంధ్రదేశంపై మొదటిసారిగా మహ్మదీయులు ప్రతాపరుద్రుడి కాలంలోనే దండయాత్రలు చేశారు. మొట్టమొదటి ముస్లిం దండయాత్ర క్రీ.శ. 1303లో కాకతీయ రాజ్యంపై జరిగింది. ఆ దండయాత్రలో ముస్లింలు ఓడిపోయినట్లు ఓరుగల్లు కోటలోని స్తంభ శాసనం విశదీకరిస్తోంది. అల్లావుద్దీన్‌గా పేరు మార్చుకున్న గర్షాప్స్ మాలిక్ దీనికి నాయకత్వం వహించాడు. ఈ యుద్ధం ఉప్పరిపల్లి (కరీంనగర్ జిల్లా) వద్ద 1303 లో జరిగింది.
క్రీ.శ. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ నాయకత్వంలో రెండోసారి ఓరుగల్లుపై దాడి జరిగింది. అతడు హనుమకొండ, ఓరుగల్లు కోటను ముట్టడించాడు. 25 రోజులపాటు ప్రతాపరుద్రుడి సైన్యాలకు, ఖిల్జీ సైన్యాలకు మధ్య భీకరయుద్ధం జరిగింది. అంతర్గత కారణాల వల్ల ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్‌కు లొంగిపోయి, సంధికి అంగీకరించాడు. నాయంకర వ్యవస్థలో రేచర్ల పద్మనాయకులకు ప్రతాపరుద్రుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడి ్డరాజులు అతడితో కలిసి పనిచేయక పోవడమే ఓటమికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
క్రీ.శ. 1323లో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై మూడోసారి దాడిచేశారు. ఢిల్లీ సుల్తానత్ తుగ్లక్ వంశ స్థాపకుడైన ఘియాసుద్దీన్ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేయడం కోసం తన కుమారుడైన ఉలుగ్ ఖాన్‌ను (మహ్మద్ బిన్ తుగ్లక్) భారీ సైన్యంతో ఓరుగల్లుకు పంపాడు. ప్రతాపరుద్రుడు సుమారు ఐదు నెలలపాటు వీరోచితంగా పోరాడినా అపజయం తప్పలేదు. మహ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకెళుతుండగా, మార్గమధ్యలో ప్రతాపరుద్రుడు నర్మదా నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రెడ్డిరాణి అనితల్లి క్రీ.శ. 1423లో వేయించిన కలువచేరు శాసనం ద్వారా తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ మహా సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమైంది. మహ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చాడు.
కాకతీయ ప్రతాపరుద్రుడు ధీరోదాత్తైమైన, బలపరాక్రమ, శౌర్య గుణాలు కలవాడు. రాయలసీమలోని అడవి ప్రాంతాలైన త్రిపురాంతకం, శ్రీశైలం, కర్నూలులో దట్టమైన అడవులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చాడు. అనేక నూతన నగరాలు నిర్మించాడు. కాకతీయ రాజ్యంలో రాయలసీమ ప్రాంతాలను విలీనం చేసిన తర్వాత, ప్రతాపరుద్రుడు కాంచీపురంపై దాడిచేసి, పాండ్యరాజులైన వీరపాండ్యుడిని, సుందరపాండ్యుడిని జయించాడు. ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి, తెలుగు భాషకు వారి సంస్కృతికి రక్షణ కల్పించిన ఘనత కాకతీయులదే.
కాకతీయుల కాలంనాటి పరిస్థితులు
దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో కాకతీయుల కాలం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 3 శతాబ్దాల పాటు, ఓరుగల్లు కేంద్రంగా ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి, చరిత్రలో ఆంధ్రదేశాధీశ్వరులుగా వీరు పేరుగాంచారు. వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించారు. వీరి కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు ప్రాచుర్యం పొందాయి. వారి రాజధాని ఓరుగల్లు ఆంధ్ర మహానగరిగా ప్రసిద్ధి పొందింది. ఉత్తర దేశం నుంచి వచ్చిన మహ్మదీయుల దాడులను ఎదుర్కొని, ఆంధ్రుల స్వాతంత్య్ర సంస్కృతులను రక్షించిన వారు కాకతీయులే! మధ్యయుగాల నాటి, సామాజిక, సాంస్కృతిక రంగాలకు గట్టి పునాదులు వేసి, వీరి తర్వాత వచ్చిన రెడ్డి, పద్మనాయక, విజయనగర వంశాలను ప్రభావితం చేశారు.
పాలనా విధానం: కాకతీయుల యుగంనాటి రాజనీతి వ్యవస్థను కాకతీయ రుద్రదేవుడు రచించిన నీతిసార సంస్కృత గ్రంథం, శివదేవయ్య పురుషార్థసారం, మడికి సింగన.. సకలనీతి సమ్మతం, బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి వంటి గ్రంథాలు, శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. వీరు సంప్రదాయ రాచరికాన్ని అనుసరించారు. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. రాజు నిరంకుశుడైనప్పటికీ, ధర్మశాస్త్రాలను అనుసరించి పాలించేవారు. స్త్రీలకు కూడా రాజ్యాధికార హక్కు కల్పించారు. ఇందుకు నిదర్శనంగా రుద్రమదేవిని పేర్కొనవచ్చు. వీరి కాలంలో దత్తత ద్వారా కూడా వారసత్వ హక్కు సంక్రమించేది. రాణీ రుద్రమదేవి మనుమడు రెండో ప్రతాపరుద్రుడు దత్తత ద్వారానే రాజ్యాధికారం చేపట్టాడు. రాజ్యంలో రాజు సర్వాధికారి. చాతుర్వర్ణ సముద్ధరణ ముఖ్యమని కాయస్థ అంబదేవుడి త్రిపురాంతకం శాసనం విశదీకరిస్తోంది. రాజుకు వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, కళలపై అవగాహన ఉండాలి. రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అనేక విద్యల్లో శిక్షణపొంది, రాజనీతి సూత్రాలకు అనుగుణంగా పాలించారు.
రాజు నిర్ణీత సమయాల్లో ప్రజలకు దర్శనమిచ్చి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని కాకతీయ రుద్రదేవుడి సంస్కృత నీతిసార గ్రంథం బోధిస్తోంది. రాజుకు ఎంత సన్నిహితుడైనా, యోగ్యత లేనివాడిని మంత్రిగా నియమించరాదని బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి సూచిస్త్తోంది. వేదశాస్త్ర, రాజనీతి కోవిదులైన బ్రాహ్మణులనే మంత్రులుగా నియమించాలని నాటి రాజనీతి గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ కాకతీయులు దీనికి విరుద్ధంగా అన్ని వర్గాల ప్రజలకు మంత్రి మండలిలో అవకాశమిచ్చారు. రాజుకు పరిపాలనలో మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. గణపతిదేవుడికి మల్యాల హేమాద్రి రెడ్డి, ప్రతాపరుద్రుడికి ముప్పిడి నాయకుడు వంటి బ్రాహ్మణేతరులు మహా ప్రధానులుగా ఉన్నారు. మడికి సింగన రాసిన సకలనీతి సమ్మతం గ్రంథం ప్రకారం రాజుకు పరిపాలనలో సహాయంగా 21 మంత్రుల వివరాలు పేర్కొన్నాడు. వీరినే అష్టాదశ తీర్థులని ఈ గ్రంథం పేర్కొంది. రాజు మంత్రులతో, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని శివదేవయ్య పురుషార్థసారం పేర్కొంటోంది. రాజుకు పరిపాలనలో సహాయపడడానికి 72 మంది నియోగాల (రాజోద్యోగుల)ను నియమించేవారు. వీరినే బహత్తర నియోగాలు అనేవారు. ఈ 72 శాఖల రాజోద్యోగులకు బహత్తర నియోగాధిపతి ఉన్నతాధికారిగా వ్యవహరించేవాడు. గణపతిదేవుడు తన హయాంలో కాయస్థ గంగయ సాహిణిని బహత్తర నియోగాధిపతిగా నియమించాడు.
రాజుకు అంగరక్షకులు ఉండేవారు. అంతఃపుర రక్షకుడిని నగరి శ్రీకావలి అని పిలిచేవారు. లెంకలు అనే గిరిజన తెగలు పాలకవర్గాలకు సేవలు అందించేవి. కాకతీయుల రాజ్యవిస్తరణలో, పాలనలో... దివిసీమను పాలించిన పినచోడిరాజు, నిడదవోలు చాళుక్యులు, కోట, సతనాటి, సాగి వంశీయులు (సామంతరాజులు) ప్రధాన పాత్ర వహించారు. వీరు అనేక యుద్ధాల్లో విజయాలు చేకూర్చడమే కాకుండా, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాకతీయ రాజులతో వివాహ సంబంధాలు కొనసాగించారు.
Advertisements
1 comment:
Thank you...
Great work
Post a Comment