Advertisements

May 14, 2014

Integrated Preparation for General Studies(TM)

అన్నీ పోటీపరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించాం. వాటికి సమగ్ర ప్రిపరేషన్ (ఇంటిగ్రెటెడ్ ప్రిపరేషన్) చేస్తే చాలాతక్కువ సమయంలో ఉద్యోగం సాధించవచ్చు. సాధారణంగా అన్ని పరీక్షల్లో కామన్‌గా ఉన్న అంశాలు, జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ముందుగా జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానాన్ని ఈ పరిశీలిద్దాం...


జనరల్ స్టడీస్:
సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు, రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్-1, గ్రూప్-2, ఎస్,ఐ., పోలీస్ కానిస్టేబుల్ తదితర పరీక్షల్లో ఉంటాయి. వీటిలో అంశాలు అవే అయినా పరీక్షస్థాయిని బట్టి కఠినత్వం మారుతుంది. సాధారణంగా చరిత్ర, పాలిటీ, ఎకానమి, సైన్స్, భూగోళశాస్త్రం (జాగ్రఫీ) అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మినహా మిగతా పరీక్షల్లో ప్రశ్నలు నేరుగా, పెద్దగా విశ్లేషణ కోణంలో కాకుండా అడుగుతారు. ఉదాహరణకు గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో అడిగిన ప్రశ్నను చూద్దాం..



@ హుయాన్ త్సాంగ్, ఎవరి కాలంలో భారత్‌ను సందర్శించారు (హర్షుడి కాలంలో). ఇదే స్థాయిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అడగరు. స్థాయి చాలాఎక్కువగా ఉంటుంది. 2013లో ఈ అంశంపై సివిల్ సర్వీసెస్‌లో అడిగిన ప్రశ్న- 
@ హుయ్యన్ త్సాంగ్ తన భారత పర్యటనలో భారత సాధారణ, సాంస్కతిక పరిస్థితులు పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న వాటిలో కింది వానిలో సరైనదేది?
పై రెండు ప్రశ్నల తీరు చూస్తే సివిల్స్‌లో ఏ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయో అవగతం అవుతుంది. అంటే సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటే, ప్రతి అంశానికి లోతైన అధ్యయనం అవసరం. కేవలం చరిత్రకే కాదు, పాలిటీ, సైన్స్, జాగ్రఫీ అంశాలకు కూడా ఇది వర్తిస్తుంది. పాలిటీలో వచ్చిన ప్రశ్నల తీరును పరిశీలిస్తే..


@ ద్రవ్యబిల్లును ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి?
@ ఒకవేళ ద్రవ్యబిల్లును రాజ్యసభ సవరణ చేస్తే ఆ తర్వాత పరిణామం ఏంటీ?
పైన పేర్కొన్న వాటిలో తొలి ప్రశ్న సివిల్ సర్వీసెస్ కాకుండా ఇతర పరీక్షల్లో వచ్చింది. అదే రెండో ప్రశ్న 2013 సివిల్స్‌లో వచ్చింది. అంటే ఈ అంశంలోనూ ప్రశ్న స్థాయి కఠినంగా ఉందన్న విషయం స్పష్టం అవుతుంది. 
ఎలా సిద్ధం కావాలి: ఏ పరీక్షకు సిద్ధం అవుతున్న వారైనా సరే ముందుగా ప్రాథమిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. సాధారణంగా అన్ని గ్రూపుల విద్యార్థులు తమ డిగ్రీలో అన్ని సబ్జెక్టులు చదివేందుకు ఆస్కారం ఉండదు. సైన్స్ విద్యార్థులు చరిత్ర, ఆర్థిక శాస్త్రం, పాలిటీ లను చదవరు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు సైన్స్ సబ్జెక్టులను గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివి ఉండరు. కాబట్టి ముందుగా పాఠశాల స్థాయి అంశాలతో ప్రిపరేషన్ సాగించాలి. ఆరు నుంచి పదోతరగతి వరకు ఉన్న అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఆయా అంశాలను కూడా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. ఉదాహరణకు సైన్స్ అంశాన్నే ఎంచుకుందాం. ఇందులో ధ్వని పాఠం చదవాలనుకుంటే ముందుగా ఆరో తరగతి పుస్తకంలో ఇచ్చిన అంశాలను చదివి, ఆ తర్వాత ఏడో తరగతి, తర్వాత ఎనిమిది.... ఇలా వెళ్లాలి. ఎందుకంటే కింది తరగతిలో ఇచ్చిన అంశానికి కొనసాగింపుగా పై తరగతిలో మరిన్ని అంశాలను చేరుస్తారు. ఇది అన్ని పాఠాలకు, అన్ని సబ్జెక్టులకు వర్తింపజేయాలి. 



ఆ తర్వాత ఏ పరీక్షకు సిద్ధం అవుతున్నారో ఆ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్న పత్రాలను చదవాలి. దీంతో పరీక్ష కోణం అర్థం అవుతుంది. ఇంకా ఎక్కడ పరిజ్ఞానం పెంచుకోవాలో చూసుకొని అవసరం అయితే ఇంటర్‌స్థాయి పుస్తకాల వరకు కూడా పాఠ్యపుస్తకాలను చదవాలి. ముఖ్యంగా చరిత్రకు సంబంధించి ఇంటర్ స్థాయిలోని పాఠ్యపుస్తకాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సివిల్స్‌కు సిద్ధం అవుతున్న వాళ్లు పాఠ్య పుస్తకాలలోని ప్రాథమిక అంశాలకే పరిమితం కాకుండా ఇంకా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు పాలిటీకిగాను డీడీ బసు రాసిన ఇంట్రడక్షన్ టూ కన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, చరిత్రకు రోమిలా థాపర్, ఏఎల్ భాషం రాసిన పుస్తకాలను చదవాలి. అలాగే ఆర్థిక రంగానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పాటు తాజా ఆర్థిక సర్వే, బడ్జెట్, ప్రణాళిక సంఘం వెల్లడించిన వివరాలను సేకరించుకోవాలి.కరెంట్ అఫైర్స్‌తో ప్రిపరేషన్‌ను అనుసంధానం చేయాలి. వార్తల్లో నిలుస్తున్న అంశాలకు సంబంధించి ఆయా మాతక సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్‌ను నియమించారు.ఇది కరెంట్ అఫైర్స్. ఈ నియామకం అన్నది రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించింది. అంటే పాలిటీ కోణంలో ప్రశ్నలు ఉంటాయి. గవర్నర్ అధికారాలు, గవర్నర్ నియామక తీరు, తొలగించే తీరు... ఇలా అంశాలను ఎంచుకొని చదవాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాలకు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు కూడా ఈ తాజాదనాన్ని జోడించాలి. ముఖ్యంగా కాలుష్యం చుట్టూ ప్రశ్నలు తిరుగుతున్నాయి. అలాగే పెరుగుతున్న భూతాపం, హరిత వాయు ఉద్గారాలు... ఇలాంటి అంశాలు పాఠ్యపుస్తకాల్లో లభించవు. పత్రికల్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాసాల్లోంచి ఎంచుకోవాలి. నిత్య జీవితంలో మానవాళికి ఉపయోగపడే లేదా మానవాళికి ముప్పుగా పరిణమించే ప్రతీదీ ప్రశ్నగా వస్తుంది. అందుకే నిత్యం పేపర్ చదువుతూ జనరల్ స్టడీస్‌ను ప్రిపేర్ కావాలి. 

Advertisements

No comments:

Followers